అపోలో హాస్పిటల్ ముందస్తుగా గుర్తించే రక్త పరీక్షను అందుబాటులోకి తెచ్చింది
హైదరాబాద్ సిటీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు అపోలో హాస్పిటల్స్‌లో ‘ఈజీ చెక్’ అనే రక్త పరీక్ష అందుబాటులోకి వచ్చింది. ఈ రక్త పరీక్షలు డాటర్ క్యాన్సర్ జెనెటిక్స్ భాగస్వామ్యంతో నిర్వహించబడతాయి. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. రక్తపరీక్ష ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే ఈసీ చెక్‌ను దేశంలోనే తొలిసారిగా అపోలో హాస్పిటల్స్ అందుబాటులోకి తెచ్చాయన్నారు. ఈజీ చెక్ ద్వారా కేవలం 5 మిల్లీలీటర్ల రక్తాన్ని పరీక్షించడం ద్వారా, రొమ్ము క్యాన్సర్‌ను జీరో దశలోనే గుర్తించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చికిత్స సులువవుతుందని, చికిత్స ఖర్చు కూడా తగ్గుతుందని వెల్లడించారు. ఈసీ చెక్ ద్వారా 99 శాతం కచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ప్రతి 22 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నందున, 40 ఏళ్లు పైబడిన మహిళలందరూ ఈ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. దేశంలోని అన్ని అపోలో ఆసుపత్రులు మరియు డయాగ్నస్టిక్ సెంటర్లలో ఈజీ చెక్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అపోలో మాస్టర్ హెల్త్ చెక్‌లో ఈజీ చెక్‌ను కూడా చేర్చినట్లు ప్రకటించారు. తరువాత, డాటర్ క్యాన్సర్ జెనెటిక్స్ వ్యవస్థాపక చైర్మన్ రాజన్ దాతర్ ఈజీ చెక్ పరీక్షను శుభవార్త పరీక్షగా అభివర్ణించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ పరీక్షను యూఎస్‌ఎఫ్‌డీఏ గుర్తించిందని తెలిపారు. ప్రస్తుతం 20 దేశాల్లో ఈ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, త్వరలో అనేక ఇతర క్యాన్సర్‌లను గుర్తించే పరీక్షలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. డాటర్ క్యాన్సర్ జెనెటిక్స్ క్లినికల్ సపోర్ట్ డైరెక్టర్ డాక్టర్ సుధా మూర్తి మాట్లాడుతూ మహిళలు అపోలోలో నిర్వహించే ఈజీ చెక్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టిపిఎస్ భండారి, దినేష్ మాధవన్ తదితరులు పాల్గొన్నారు.