జ్వరంతో ఆసుపత్రులకు క్యూ
చలి, వర్షంతో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు
హైదరాబాద్ సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): వర్షం కారణంగా కాలనీలు, జనావాసాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల డ్రైనేజీ పొంగిపొర్లడంతో మురుగునీరు, చెత్తాచెదారం రోడ్లపైకి చేరుతున్నాయి. దీంతో దర్గం, దోమలు వ్యాపించి ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు నగరాన్ని కాస్త చల్లబరిచాయి. వాతావరణంలో మార్పుతో జలుబు, జ్వరం, దగ్గు, జలుబుతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే న్యుమోనియా, ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వాతావరణంతో బాధపడే అవకాశం ఉంది.
వర్షం, చలితో కేసులు పెరుగుతున్నాయి
జ్వరాలతో వైద్యుల వద్దకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, దగ్గు, టైఫాయిడ్ వ్యాధులు ప్రజలను పీడిస్తున్నాయి. ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో నాలుగైదు రోజులుగా ఓపీల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ జిల్లాలో గత 20 రోజుల్లో 20 టైఫాయిడ్ కేసులు, వివిధ కారణాలతో 1300 జ్వరం, 3 వేల ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్, గాంధీ ఆసుపత్రుల ఓపీకి వచ్చే వారిలో సగానికిపైగా జ్వరసంబంధమైన వారే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఫ్లూతో ముప్పు
కలుషితమైన గాలితో ఫ్లూ ముప్పు వస్తుంది. తేమ వాతావరణంలో వైరస్ రెట్టింపు శక్తితో దాడి చేస్తుంది. ఫ్లూ కారణంగా స్వైన్ ఫ్లూ, న్యుమోనియా, ఆస్తమా, కోవిడ్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఫ్లూ పెరిగితే వైద్యుల సలహా మేరకు రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.
ఈ జాగ్రత్తలు సరైనవే..
- వర్షంలో తడవకుండా జాగ్రత్తపడాలి.
- ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి.
- ఫ్రిజ్‌లో నీరు, ఆహారం తీసుకోవద్దు. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.
- పండ్లు, కూరగాయలు, పాలు, చపాతీలు ఎక్కువగా తీసుకోవాలి.
- వర్షాకాలంలో పనిచేసేవారు మంచినీళ్లు, ఎలక్ట్రోలైట్ పౌడర్ తాగాలి.
- బట్టలు, పరుపులు, దుప్పట్లు తడిసిపోకుండా చూసుకోవాలి.
- వెచ్చని బట్టలు ధరించండి. రోజూ మీ బట్టలు మార్చుకోండి.
- ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇంట్లో తప్పనిసరిగా దోమతెరలు వాడాలి.
- ఈగలు, దోమలు పెరిగే ప్రాంతాలను వెంటనే శుభ్రం చేయాలి.
- ఇంటి గోడలపై పేరుకుపోయిన నాచు, నీటి ప్రవాహాలు, మట్టిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
- మల, మూత్ర విసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
- జ్వరం 48 గంటల కంటే ఎక్కువ ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
– డాక్టర్ నందన జాస్తి, జనరల్ ఫిజీషియన్, మెడికోవర్ ఆసుపత్రి

నవీకరించబడిన తేదీ – 2022-07-29T19:38:58+05:30 IST