దీనిపై బుధవారం సమాధానం ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది
హైదరాబాద్ , అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): నీట్ మెడికల్ పీజీ అడ్మిషన్లలో తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులకు ఇన్‌సర్వీస్ కోటా వర్తిస్తుందా? లేదా? ఈ అంశంపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 12న అడ్వకేట్ జనరల్ విచారణకు వచ్చి ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టం చేయాలని అందులో పేర్కొంది. తమకు గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్ల సర్వీసు ఉందని, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల అనుభవం ఉందని, అయినప్పటికీ మెడికల్ పీజీ అడ్మిషన్లలో తమకు ఇన్ సర్వీస్ రిజర్వేషన్ వర్తించలేదని డాక్టర్ దినేష్ కుమార్, మరికొందరు వైద్యులు హైకోర్టులో పిటిషన్ వేశారు. . దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు.. సోమవారం వరకు సీట్ల కేటాయింపు పూర్తి చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సోమవారం మరోసారి ఈ పిటిషన్‌పై జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తరపున వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ వైద్యవిధాన పరిషత్, బీమా వైద్యసేవల విభాగంలో పనిచేస్తున్న వైద్యులకు జీవో 155 ప్రకారం గిరిజన, గ్రామీణ ప్రాంతాల సేవ వర్తించదన్నారు. ఈ విభాగాలకు చెందిన వైద్యులు ప్రాంతాలతో సంబంధం లేకుండా 6 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారికే ఇన్ సర్వీస్ కోటా వర్తిస్తుందని తెలిపారు. పిటిషనర్ల తరపున న్యాయవాది సామ సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. ఇదిలావుంటే గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులెవరూ పనిచేయరని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వేతనాలు, ఫీజులు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసిన ధర్మాసనం.. పీజీ మెడికల్ సీట్ల కేటాయింపును ఈ నెల 12వ తేదీ వరకు చేపట్టరాదని పేర్కొంది.