8 జిల్లాల్లో వరదలు.
పాఠశాలలకు సెలవు.. హెల్ప్‌లైన్‌ల ఏర్పాటు
చెన్నై, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాల ప్రభావం, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. చెన్నైతో పాటు ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరం అస్తవ్యస్తంగా మారింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌తో పాటు జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా నగరంలోని నుంగంబాక్కంలో ఒక్కరోజే 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మూడు దశాబ్దాల తర్వాత చెన్నై నగరంలో ఇంత భారీ వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి అని, గత 72 ఏళ్లలో ఇది మూడోసారి అని వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు. అలాగే శివారు ప్రాంతమైన రెడ్‌హిల్స్‌లో 13 సెంటీమీటర్లు, పెరంబూర్‌లో 12 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసినట్లు తెలిపారు. ఉత్తర చెన్నైలోని పులియంతోపులో మొదటి అంతస్తు బాల్కనీ కూలిపోవడంతో విద్యుదాఘాతంతో ఓ మహిళ, ఆటో డ్రైవర్ మృతి చెందారు. మరోవైపు నగరంలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. సబ్‌వేలలోకి భారీగా నీరు చేరడంతో వాటిని మూసివేశారు.
దీంతో ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద బాధితుల కోసం చెన్నై కార్పొరేషన్ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. భారీ వర్షాల కారణంగా మంగళవారం చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, నాగపట్నం, మైలదుదురై, తంజావూరు, తిరువారూరు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు తమిళనాడులో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. పరిస్థితి విషమించడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రులు, జిల్లా కలెక్టర్లు, నగర కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు ప్రారంభించడంతో పాటు అన్ని చోట్లా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
నవీకరించబడిన తేదీ – 2022-11-02T05:39:43+05:30 IST