గృహిణులకు నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సాయం అందించే పథకానికి సంబంధించి ఇంటింటికీ దరఖాస్తులు, టోకెన్లు ఈ నెల 20వ తేదీ గురువారం నుంచి.
పారిస్ (చెన్నై): గృహిణులకు నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించే పథకానికి సంబంధించి ఈ నెల 20వ తేదీ గురువారం నుంచి ఇంటింటికీ దరఖాస్తులు, టోకెన్లు పంపిణీ చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి రోజైన సెప్టెంబర్ 15 నుంచి ‘కలైంజర్ మగళిర్ ఉరుమై’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా గృహిణులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రూ.7 వేల కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో అర్హులైన మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ పథకానికి సంబంధించిన టోకెన్లు, దరఖాస్తులను గురువారం నుంచి ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. ఈ పనుల్లో దాదాపు 3,400 మంది ఉద్యోగులు పాల్గొంటారు. కాగా, గృహిణులకు రూ.1000 పథకం అమలుపై గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జె.రాధాకృష్ణన్, పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ రాథోడ్, కలెక్టర్ అరుణ తదితరులు బుధవారం రాజధాని నగరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి నగరంలోని గృహిణులకు రూ.1000 అందించే పథకం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు గురువారం నుంచి కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక శిబిరాలు నిర్వహించే ప్రాంతాలను గృహిణులకు తెలియజేయడంతో పాటు టోకెన్లు, దరఖాస్తులు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 24 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు మొదటి విడత దరఖాస్తుల నమోదు కొనసాగుతుందని, 98 వార్డుల్లో శిబిరాల ఏర్పాటు పనులు చేపట్టామన్నారు. రెండో విడతగా 102 వార్డుల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని, దరఖాస్తుల కోసం లబ్ధిదారులు రేషన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. టోకెన్లు పొందిన వారు పూర్తి చేసిన దరఖాస్తుతో ఆధార్ నంబర్, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లుల రసీదు, బ్యాంకు పాస్ బుక్‌తో శిబిరానికి రావాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు బ్యాంకు ఖాతా లేని వారికి ఆయా క్యాంపుల్లో ఖాతా సౌకర్యం కల్పిస్తున్నట్లు జీసీసీ కమిషనర్ రాధాకష్ణన్ తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-20T10:31:32+05:30 IST