మణిపూర్: ఎడతెగని అల్లర్లు, కేంద్రమంత్రికి మరో చేదు అనుభవం

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-07-24T20:47:49+05:30 IST

రెండు నెలల క్రితం మణిపూర్‌లో మొదలైన హింసకు అంతులేదు. సోమవారం, శాంతియుత నిరసనకు పోలీసులు అనుమతించడంతో ర్యాలీ చేపట్టిన పలువురు మహిళలు కేంద్ర మంత్రి ఆర్‌కె రంజన్ సింగ్ నివాసం వద్ద గుమిగూడారు. ఆయన ఇంటిపై రాళ్లు రువ్వారు.

మణిపూర్: ఎడతెగని అల్లర్లు, కేంద్రమంత్రికి మరో చేదు అనుభవం

ఇంఫాల్: మణిపూర్‌లో రెండు నెలల క్రితం మొదలైన హింసాకాండ ఓ కొలిక్కి రావడం లేదు. శాంతియుత నిరసనకు పోలీసులు అనుమతించడంతో సోమవారం కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ నివాసం వద్ద ర్యాలీ నిర్వహించిన పలువురు మహిళలు తరలివచ్చారు. ఆయన ఇంటిపై దాడి చేశారు. రాళ్లు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆందోళనకు దిగిన మహిళలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. గత రెండు నెలల్లో రంజన్ సింగ్ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేయడం ఇది రెండోసారి.

దాడి జరిగినప్పుడు మంత్రి ఇంట్లో ఎవరూ లేరని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. మణిపూర్‌లో తమ దుస్థితిపై పార్లమెంటులో మాట్లాడాలని, ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. మంత్రి నివాసంలో పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది సకాలంలో వారిని చెదరగొట్టారు. మే 3న జాతి సమూహాల (కుకి, మీతీ) మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పుడు మొదటిసారిగా మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. ఆ తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని పొడిగిస్తూనే ఉంది.

కాగా, జూన్ 15న రంజన్ సింగ్ ఇంటిపై ఆందోళనకారులు దాడి చేసి.. రాళ్లు రువ్వి, ఇంటికి నిప్పు పెట్టారు. అయితే సకాలంలో భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి విచారం వ్యక్తం చేశారు. తనను ఎన్నుకున్న ప్రజలే తన నివాసంపై దాడులు చేయడం బాధాకరమని, ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. దేవుడి దయ వల్లే దాడి జరిగిన సమయంలో తన కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరని, అందరూ ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు.

నవీకరించబడిన తేదీ – 2023-07-24T20:47:49+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *