IND vs WI: సూర్యకు డూ ఆర్‌ డై.. సంజూ, కిషన్‌లో కీపింగ్ చేసేది ఎవరంటే.. తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?


బార్బడోస్: గురువారం నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. అయితే మొదటి వన్డే మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రధానంగా వికెట్ కీపింగ్, స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరిని ఆడించాలనే విషయంలో మేనేజ్‌మెంట్‌కు సైతం తిప్పలు తప్పేలా లేవు. ఈ క్రమంలో మొదటి వన్డే మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. మ్యాచ్ జరిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ ఇటీవల కాలంలో బ్యాటింగ్ అనుకూలిస్తోంది. ఇక్కడ ఆడిన చివరి మ్యాచ్‌లో 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. బౌలింగ్‌లో పేసర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిని బట్టి తుది జట్టులో పేసర్లకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి.

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఖాయం కాగా మూడో స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నాడు. నాలుగో స్థానంలో మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించే అవకాశాలున్నాయి. ఒక రకంగా సూర్య వన్డే కెరీర్‌కు ఈ మ్యాచ్ చావో రేవో లాంటింది. చివరగా ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే సిరీస్‌లో సూర్య వరుసగా 3 మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ సెలెక్టర్లు అతనికి మరో అవకాశం ఇచ్చారు. ఈ సారి కూడా విఫలమైతే భవిష్యత్‌లో వన్డే జట్టులో చోటు కష్టమే. పైగా ప్రస్తుతం గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా భవిష్యత్‌లో టీంలో చేరనున్నారు. ఇక ఐదో స్థానంలో వికెట్ కీపర్‌గా ఉండే ఆటగాడు బ్యాటింగ్ చేసే అవకాశాలున్నాయి. అయితే కీపర్‌గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. విండీస్‌తో చివరి టెస్టులో కిషన్ మెరుపు హాఫ్ సెంచరీ కొట్టాడు. పైగా వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. కానీ కీపింగ్ నైపుణ్యం పరంగా కిషన్ కంటే శాంసనే బెటర్ అని చెప్పుకోవాలి. పైగా శాంసన్‌కు ఫినిషింగ్ నైపుణ్యం కూడా ఉంది. శాంసన్ చివరగా ఆడిన వన్డే మ్యాచ్‌ల్లో ఇది చేసి చూపించాడు. అనుభవం పరంగా తీసుకున్న శాంసన్‌కు ఎక్కువ మార్కులు పడే అవకాశాలున్నాయి. కానీ టాపార్డర్‌లో ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా లేడు. కాబట్టి టాపార్డర్‌లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండాలనుకుంటే మేనేజ్‌మెంట్ కిషన్ వైపే మొగ్గుచూపడం ఖాయం.

ఇక ఆల్‌రౌండర్ల కోటాలో పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా, స్పిన్ ఆల్ రౌండర్‌గా రవీంద్ర జడేజాల స్థానాలకు ఢోకా లేదు. ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, చాహల్‌లో ఒక్కరినే ఆడించే అవకాశాలున్నాయి. కాగా బ్యాటింగ్ చేసే నైపుణ్యం కూడా ఉండడంతో స్పిన్ కోటాలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పేస్ కోటాలో మహ్మద్ సిరాజ్ ఖాయం కాగా.. మరో పేసర్‌గా ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. శార్దూల్ ఠాకూర్ గాయం నుంచి కోలుకుంటే అతడినే ఆడించొచ్చు. లేదంటే ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఒక వేళ ముగ్గురు ప్రధాన పేసర్లతో వెళ్లాలనుకుటే అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టి ఉమ్రాన్, ముఖేష్‌ ఇద్దిరినీ ఆడించే అవకాశాలుంటాయి.

టీమిండియా తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/చాహల్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *