రోల్‌మోడల్‌గా ఉండే వాళ్లే ఇలా చేస్తే ఎలా? హర్మన్‌ప్రీత్ కౌర్‌పై మిథాలీ రాజ్ ఆగ్రహం


టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ మంచి క్రీడాకారిణి అన్న మిథాలీ.. ఆమె యువ క్రీడాకారిణులకు రోల్ మోడల్ అన్నారు. కనుక వారంతా హర్మన్‌ప్రీత్ కౌర్‌ను అనుసరించాలని అనుకుంటారని, కాబటి మైదానంలో, మైదానం వెలుపల హర్మన్ ప్రీత్ కౌర్ గౌరవప్రదంగా నడుచుకోవాలని మిథాలీ సూచించారు. ‘‘ఒకప్పుడు మహిళల క్రికెట్‌కు పెదగా కవరేజ్ ఉండేది కాదు. కాబట్టి సోషల్ మీడియాలో మహిళల క్రికెట్ గురించి కనిపించేది కాదు. కానీ ప్రస్తుతం అలా కాదు. మహిళల క్రికెట్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రతిది పబ్లిక్‌లోకి వెళ్లిపోతుంది. కాబట్టి యువ క్రీడాకారిణులు చూస్తుంటారు. వారు కూడా సీనియర్లను అనుసరిస్తారు. కాబట్టి రోల్‌మోడల్స్‌గా ఉండే వాళ్లు ఇలా చేస్తే ఎలా? దూకుడుగా వ్యవహరించడం, భావోద్వేగాలను ఒక పరిమితి వరకు చూపించడం ఫర్వాలేదు. కానీ ఆట అనేది వ్యక్తుల కంటే ఎక్కువ అని మరచిపోకూడదు. హర్మన్ వేదనను అర్థం చేసుకోగలిగినప్పటికీ, ఆమె ప్రవర్తనను క్షమించకూడదు.’’ అని మిథాలీ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సిరీస్‌‌లో బంగ్లాదేశ్ పోరాడిన విధానానికి క్రెడిట్ ఇవ్వాలని చెప్పారు. అది మహిళా క్రికెట్‌కు మంచి చేస్తుందని అని మిథాలీ రాజ్ అన్నారు.

కాగా బంగ్లాదేశ్‌ ఉమెన్స్ జట్టుతో ముగిసిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తించిన తీరు ఈ విమర్శలకు దారి తీసింది. ఆ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను కొట్టింది. అంతటితో ఆగకుండా పోస్ట్ ప్రజెంటేషన్ సెర్మనీలో అంపైర్లపై విమర్శలు చేసింది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ చట్ట పరమైన చర్యలను తీసుకుంది. ఆమెకు 75 శాతం మ్యాచ్ ఫీజ్‌ కోతతోపాటు 4 డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. 4 డీమెరిట్ పాయింట్లు వస్తే నిబంధనల ప్రకారం ఒక టెస్ట్ మ్యాచ్ లేదా రెండు వైట్ బాల్ మ్యాచ్‌‌లకు దూరం కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆసియా గేమ్స్ క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు హర్మన్ ప్రీత్ కౌర్ దూరం కానుంది. హర్మన్ ప్రీత్ కౌర్ లేకపోవడంతో టీమిండియాకు నష్టం కలిగే అవకాశాలున్నాయి. మరోవైపు హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రవర్తించిన విధానంపై అంతటా విమర్శలు కొనసాగుతున్నాయి. భారత మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్, భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ సైతం హర్మన్‌ప్రీత్ కౌర్ తీరును తప్పుబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *