Emerging Asia Cup: ఆసియా కప్ విజేత పాక్.. ఫైనల్‌లో భారత్ ఘోర పరాజయం



ABN
, First Publish Date – 2023-07-23T21:57:11+05:30 IST

ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్‌లో భారత్-ఏ జట్టు ఘోర పరాజయం పాలైంది. భారత్-ఏ పై పాకిస్థాన్-ఏ జట్టు 128 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పాకిస్థాన్-ఏ ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ట్రోఫిని గెలుచుకుంది. కాగా పాకిస్థాన్-ఏ జట్టు వరుసగా రెండో సారి ఎమర్జింగ్ ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.

Emerging Asia Cup: ఆసియా కప్ విజేత పాక్.. ఫైనల్‌లో భారత్ ఘోర పరాజయం

కొలంబో: ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ఫైనల్‌లో భారత్-ఏ జట్టు ఘోర పరాజయం పాలైంది. భారత్-ఏ పై పాకిస్థాన్-ఏ జట్టు 128 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో పాకిస్థాన్-ఏ ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 ట్రోఫిని గెలుచుకుంది. కాగా పాకిస్థాన్-ఏ జట్టు వరుసగా రెండో సారి ఎమర్జింగ్ ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. పాకిస్థాన్ విసిరిన 353 పరుగుల భారీ లక్ష్య చేధనలో భారత జట్టు 40 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు సాయి సుదర్శన్(29), అభిషేక్ శర్మ(61) మంచి ఆరంభాన్నే ఇచ్చినప్పటికీ మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫమయ్యారు. కెప్టెన్ యష్ ధూల్(39) కూడా కాసేపు క్రీజులో ఉండడంతో ఒకానొక దశలో భారత జట్టు 157/3తో మంచి స్థితిలోనే కనిపించింది. కానీ ఆ తర్వాత పాక్ బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. మరో 67 పరుగుల వ్యవధిలోనే మిగతా 7 వికెట్లను కోల్పోయింది. నికిన్ జోస్ 11, నిషాంత్ సింధు 10, రియాన్ పరాగ్ 14, ధృవ్ జురేల్ 9, హర్షిత్ రానా 13 పరుగులు మాత్రమే చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్ 3, అర్షద్ ఇక్బాల్, మెహ్రాన్ ముంతాజ్, మహ్మద్ వసీం రెండేసి వికెట్లు.. ముబాసిర్ ఖాన్ ఒక వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు బ్యాటర్ తయ్యబ్ తాహిర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 12 ఫోర్లు, 4 సిక్సులతో 71 బంతుల్లోనే 108 పరుగులు చేశాడు. తాహిర్‌కు తోడు ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్(65), సైమ్ అయూబ్ (59) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్లిద్దరూ మొదటి వికెట్‌కు సెంచరీ(121) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలాగే ముబాసిర్ ఖాన్(35)తో కలిసి తయ్యబ్ తాహిర్ కూడా ఆరో వికెట్‌కు 97 బంతుల్లోనే 126 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒమైర్ యూసుఫ్(35) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో హంగర్గేకర్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు.. హర్షిత్ రానా, మానవ్ సుతార్, నిశాంత్ సింధు తలో వికెట్ తీశారు. తయ్యబ్ తాహిర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు దక్కింది. భారత ఆటగాడు నిశాంత్ సింధుకు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు దక్కింది.

Updated Date – 2023-07-23T21:57:43+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *