పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ ఏ క్షణంలోనైనా రద్దయ్యే అవకాశం ఉంది. తాజాగా ఇమ్రాన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పీటీఐని రద్దు చేస్తే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ పేరుతోనే విజయం సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఏ క్షణంలోనైనా రద్దు అయ్యే అవకాశం ఉంది. పీటీఐని రద్దు చేయాలంటూ అధికార పార్టీ నుంచి డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. మే 9న ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడం, ఆయనపై అనేక కేసులు నమోదవడం, ఐటీ దాడులు జరగడం ఈ ఊహాగానాలకు తావిచ్చింది. తాజాగా ఇమ్రాన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పీటీఐని రద్దు చేస్తే కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీ పేరుతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తానని నిక్కీ ఆసియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
పాకిస్థాన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే పీటీఐని రద్దు చేయడం ఒక్కటే మార్గమని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా ఇటీవల అన్నారు. రక్షణ మంత్రి ఖ్వాజీ ఆసిఫ్ మాట్లాడుతూ.. పీటీఐని రద్దు చేయాలని ఆలోచిస్తున్నామని, పీపీపీ చైర్మన్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా పీటీఐపై నిషేధానికి అభ్యంతరం లేదని చెప్పారు. పీటీఐ రద్దుపై నిక్కీ ఆసియా ఇమ్రాన్‌ను ప్రశ్నించగా.. పార్టీని రద్దు చేస్తే కొత్త పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్తామని, అప్పుడు కూడా గెలుస్తామని బదులిచ్చారు. తనపై అనర్హత వేటు వేసినా, జైలుకు పంపినా ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. తనకు చెక్కుచెదరని మద్దతుదారులు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పీటీఐపై ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడులను ప్రస్తావిస్తూ.. బెదిరింపుల ద్వారా పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-15T17:01:28+05:30 IST