రాష్ట్రంలో బి కేటగిరీ ఇంజనీరింగ్ సీట్లు.
తాజా నోటిఫికేషన్ కోసం ‘మండలి’ అనుమతి
హైదరాబాద్ , జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బీ కేటగిరీ ఇంజినీరింగ్ సీట్లను నోటిఫికేషన్ విడుదలకు ముందే భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా కాలేజీలు తమ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 80 శాతం భర్తీ చేశాయి. ఈ సీట్ల భర్తీకి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించింది. ఈ గురువారం నాటికి ఆయా కళాశాలలు తమ పరిధిలోని మేనేజ్‌మెంట్ కోటా (బి కేటగిరీ) సీట్ల భర్తీకి పత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంబంధిత కాలేజీలు ఆగస్టు 31లోగా అడ్మిషన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అడ్మిషన్ జాబితాలను సెప్టెంబర్ 15లోగా ఉన్నత విద్యామండలికి సమర్పించాలి.అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఆయా కాలేజీలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించాలి. వచ్చిన దరఖాస్తుల్లో మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించాలి. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. డిమాండ్ ఉన్న కాలేజీల్లో ఇప్పటికే బీ కేటగిరీ సీట్లలో చాలా సీట్లు భర్తీ అయ్యాయి. సాధారణంగా ఈ కాలేజీల్లో బీ కేటగిరీ సీట్ల ఫీజు రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు నిర్ణయించారు. కానీ కాలేజీలు మాత్రం విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి.
నిబంధనలు అనుకూలంగా..
అడ్మిషన్ల ప్రక్రియను ఆయా కాలేజీలు చేపడుతున్నాయని, ప్రభుత్వ నిబంధనల వల్లే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా మెడికల్ సీట్ల భర్తీ మాదిరిగానే బీ కేటగిరీ ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తే పేద, మెరిట్ విద్యార్థులకు న్యాయం జరుగుతుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. కొన్ని కాలేజీలు బి కేటగిరీ సీట్ల భర్తీకి దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు. ఆఫ్‌లైన్ దరఖాస్తుల కోసం కాలేజీకి వెళ్తే దరఖాస్తు ఫారం కూడా ఇవ్వలేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే.. సాంకేతిక కారణాలు చూపుతూ అనుమతి ఇవ్వలేదు.. దరఖాస్తు చేసినా.. ఏ కారణం చూపి తిరస్కరిస్తున్నారు. అంతేకాదు ఒక విద్యార్థి నాలుగైదు టాప్ కాలేజీల్లో సీటు కోసం పోటీ పడాలంటే ఆ కాలేజీల్లో విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో దరఖాస్తుకు రూ.1000 నుంచి 2000 వరకు చెల్లించాలి. దరఖాస్తులకే రూ.10 వేలకు పైగా ఖర్చయ్యే పరిస్థితి ఉంది. దరఖాస్తు చేసుకున్నా.. సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదు.
ప్రభుత్వ సహకారంతో దోపిడీ : బాలకృష్ణారెడ్డి
టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు కాలేజీలు ఇప్పటికే బీ కేటగిరీ సీట్లను విక్రయించుకున్నాయన్నారు. ప్రభుత్వ అండదండలతోనే కాలేజీలు ఈ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-20T11:35:08+05:30 IST