7 వేల మంది టీచర్లకు డిప్యుటేషన్!
ఉపాధ్యాయుల కొరత పాఠశాలల్లో సర్దుబాటు
బదిలీలు లేకపోవడంతో సమస్య తలెత్తింది
హైదరాబాద్ , జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 7 వేల మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 4 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన వారిని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఈనెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సుమారు 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 25 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బడిబాట పేరుతో ఈ నెల 3వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభం కాగా, లక్ష మందికి పైగా చేరారు. కాగా, రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ కోర్టు స్టే రావడంతో ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండగా.. కొన్ని చోట్ల అదనంగా ఉంటున్నారు. సాధారణంగా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రేషనలైజేషన్ ద్వారా ఆయా పాఠశాలల అవసరాలకు అనుగుణంగా బదిలీలు చేయాల్సి ఉంటుంది. అయితే ఉపాధ్యాయుల బదిలీలు, రేషనలైజేషన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. మరోవైపు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అమలు చేస్తున్న ఇంగ్లిష్ మీడియంను ఈ ఏడాది నుంచి 9వ తరగతిలో కూడా అమలు చేస్తున్నారు. అందుకోసం ఆయా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ అధికారులు తాత్కాలిక సర్దుబాటు కింద ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే 4 వేల మందిని వారు పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలోని పాఠశాలలకు పంపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని పలు ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. బదిలీల కోసం కొన్నేళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమాలపై విచారణ జరపాలి: యూటీఎఫ్
10వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం కవర్ పేపర్‌పై రాజ్యాంగ ప్రవేశికను తప్పుగా ప్రచురించారని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. ఎస్‌సిఇఆర్‌టి ప్రచురించిన 10వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం కవర్ పేజీపై ముద్రించిన రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలను తొలగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.