టెట్: మళ్లీ టెట్..! పోస్టుల భర్తీ ఎప్పుడు..!

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-07-08T12:02:26+05:30 IST

త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖ కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

టెట్: మళ్లీ టెట్..!  పోస్టుల భర్తీ ఎప్పుడు..!

విద్యాశాఖపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

గత ఏడాది జూన్‌లో చివరి పరీక్ష జరిగింది

ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై చర్చ లేదు

రాష్ట్రంలో 24 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి

హైదరాబాద్ , జూలై 7 (ఆంధ్రజ్యోతి): త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖ కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టెట్, మన ఊరుమన బడి తదితర అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, తలసాని శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ముందే టెట్ నిర్వహించాలన్న డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే టెట్ పరీక్షను నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మూడు సార్లు టెట్ నిర్వహించారు. గత ఏడాది జూన్ 12న చివరిసారిగా పరీక్ష జరిగింది. కాగా, మన ఊరుమన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తొలిదశ కార్యక్రమం అనుకున్న స్థాయిలో జరగలేదని మంత్రులు ఈ సందర్భంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయడంతోపాటు కొత్తగా రెండో దశ పనులు కూడా చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని ఏడాది క్రితం సీఎం కేసీఆర్ సభా వేదికపై ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ అంశంపై శుక్రవారం మంత్రివర్గ ఉపసంఘం చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. ఆ తర్వాత ఇప్పటి వరకు ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్రంలో దాదాపు 24 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

నవీకరించబడిన తేదీ – 2023-07-08T12:02:26+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *