T20 వరల్డ్ కప్: 2024 T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇది! ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..?

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-07-29T15:26:38+05:30 IST

2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. 2024 జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుందని జాతీయ క్రీడా వెబ్‌సైట్ పేర్కొంది.అంటే పొట్టి ప్రపంచకప్ 27 రోజుల పాటు క్రికెట్ ప్రేమికులను అలరిస్తుంది.

T20 వరల్డ్ కప్: 2024 T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఇది!  ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..?

2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. 2024 జూన్ 4 నుంచి 30 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుందని జాతీయ క్రీడా వెబ్‌సైట్ పేర్కొంది.అంటే పొట్టి ప్రపంచకప్ 27 రోజుల పాటు క్రికెట్ ప్రేమికులను అలరిస్తుంది. ఈ ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఐసీసీ క్రికెట్ ఈవెంట్‌ను నిర్వహించడం అమెరికాకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. టీ20 ప్రపంచకప్ మొత్తం 10 వేదికల్లో జరగనుంది. అమెరికాలోని ఫ్లోరిడా (లాడర్‌హిల్), టెక్సాస్ (గ్రాండ్ ప్రైరీ స్టేడియం), మోరిస్‌విల్లే (చర్చ్ స్ట్రీట్ పార్క్), న్యూయార్క్ (వాన్ కోర్ట్‌ల్యాండ్ పార్క్), ఫ్లోరిడా (లాడర్‌హిల్ సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం)లలో మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఈ స్టేడియాలకు ఇంకా అంతర్జాతీయ హోదా ప్రకటించలేదు. దీనిపై త్వరలో ఐసీసీ, వెస్టిండీస్ క్రికెట్, యూఎస్ఏ క్రికెట్ నిర్ణయం తీసుకోనున్నాయి. ఆ తర్వాత ఆయా స్టేడియాలకు అంతర్జాతీయ హోదాను ప్రకటిస్తారు. ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వాలంటే ఆయా స్టేడియాలకు అంతర్జాతీయ హోదా ఉండాలి.

గతంతో పోలిస్తే ఈసారి టీ20 ప్రపంచకప్ భిన్నంగా జరగనుంది. టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. 20 జట్లను 4 గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో 5 జట్లను ఉంచుతారు. గ్రూప్‌లోని ప్రతి జట్టు మిగతా 4 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్‌లోని టాప్ 2 జట్లు సూపర్ 8కి అర్హత సాధిస్తాయి. సూపర్ 8లో అర్హత సాధించిన జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 4 జట్లు ఉంటాయి. గ్రూప్‌లోని ప్రతి జట్టు మిగతా 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. జూన్ 30న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ప్రపంచకప్ ముగియనుంది.గత ప్రపంచకప్ లో ఇంగ్లండ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

నవీకరించబడిన తేదీ – 2023-07-29T15:26:38+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *