హర్యానా హింస: ఇంటెలిజెన్స్ వైఫల్యమా? ప్రభుత్వ ఉదాసీనతే కారణమా?

న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతున్న తరుణంలో హర్యానాలోని నుహ్, గురుగ్రామ్‌లలో హింస చెలరేగి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలను ఇంటెలిజెన్స్ ముందుగానే అంచనా వేయలేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, గురుగ్రామ్‌లోని నుహ్‌లో అల్లర్లు చెలరేగవచ్చని నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టాయి. సోషల్ మీడియాలో ఇరువర్గాలు బహిరంగ హెచ్చరికలు జారీ చేశాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందించిందని, అయితే అవాంఛనీయ పరిస్థితులను నివారించడానికి రాష్ట్ర పరిపాలన తగినంత సంఖ్యలో పోలీసులను మోహరించడం లేదని చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, విహెచ్‌పి చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక యాత్రను ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గత ఫిబ్రవరిలో భివానీ జిల్లాలో ఇద్దరు ముస్లిం యువకుల మృతదేహాలు లభ్యమై గోసంరక్షణ కార్యకర్త మోను మనేసర్‌పై కేసు నమోదైనప్పటి నుంచి ముస్లిం సమాజం ఉలిక్కిపడింది. జలాభిషేక యాత్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని, దాదాపు 2,500 మంది అల్లరి మూకలు ఆలయంలోకి చొరబడి, కొన్ని దుకాణాలకు నిప్పుపెట్టి, మరికొన్నింటిని దోచుకున్నారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. హింసాత్మక ఘటనలు జరిగిన కొన్ని గంటలకే ప్రభుత్వ యంత్రాంగం ఆ ప్రాంతానికి చేరుకుందని చెబుతున్నారు. కేవలం 700 మంది పోలీసు అధికారులు, వారిలో ఎక్కువ మంది హోంగార్డులు మాత్రమే సంఘటనా స్థలానికి చేరుకున్నారని, అల్లరిమూకలు అల్లర్లు కొనసాగించడంతో కొందరు పారిపోయేందుకు ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, నుహ్ ఘటన జరిగిన సమయంలో మేవాత్ ఎస్పీ సెలవులో ఉండగా, పల్వాల్ ఎస్పీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలకు సరిపడా పోలీసు బలగాలను పంపామని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ చెబుతున్నప్పటికీ.. వారు అల్లర్ల ప్రాంతాలకు చేరుకోవడానికి చాలా సమయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం: మాజీ సీఎం

ఇంతలో, ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) నూహ్ ఘటనను విమర్శించాయి. మత ఘర్షణలను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా మాట్లాడుతూ, ఘర్షణలు జరిగే అవకాశం గురించి సిఐడి తగిన సమాచారం ఇచ్చినప్పటికీ, పరిపాలన సకాలంలో స్పందించలేదని, తగిన నిఘా ఉంచలేకపోయిందని అన్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమేనన్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావు. ఇది కేవలం సీఎం మనోహర్ ఖట్టర్ వ్యక్తిగత వైఫల్యం కాదని, పరిపాలనా యంత్రాంగం, ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు.

రెచ్చగొట్టే వీడియోలపై ఏడీజీపీ

అయితే రెచ్చగొట్టే వీడియోలు పోలీసుల దృష్టికి వెళ్లాయని, వెంటనే చర్యలు తీసుకున్నామని ఏడీజీపీ మమతా సింగ్ తెలిపారు. దీన్ని ఇంటెలిజెన్స్ వైఫల్యంగా పేర్కొనవద్దని, రెచ్చగొట్టే వీడియో షేర్ చేయడం, కౌంటర్ వీడియో షేర్ చేయడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి బలగాలను మోహరించారు. అయితే రెచ్చగొట్టే వీడియోలు పోలీసుల దృష్టికి వచ్చినా ముందస్తు అరెస్టులు, ఇంటర్నెట్ సేవలను ఎందుకు నిలిపివేయడం లేదని ప్రతిపక్షాలు మరోసారి నిప్పులు చెరిగారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు: హోంమంత్రి

మరోవైపు హర్యానాలో జరిగిన అల్లర్లు యాదృచ్ఛికంగా జరగలేదని, దేశంలో, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ముందస్తు వ్యూహమని హోంమంత్రి అనిల్ విజ్ ఆరోపించారు. అల్లరిమూకల కోసం రాళ్లు, ఆయుధాల సేకరణను చూస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటి వరకు 16 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, ఈ అల్లర్లకు బయటి ప్రాంతాల వ్యక్తులే కారణం కావచ్చనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు.

నవీకరించబడిన తేదీ – 2023-08-02T17:54:27+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *