న్యూఢిల్లీ : హర్యానాలోని నుహ్ జిల్లాలో మత ఘర్షణలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలు నిర్వహించేందుకు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌లకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే, నగరంలో జరిగే ప్రదర్శనలలో ద్వేషపూరిత ప్రసంగాలు లేదా హింసాత్మక సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిరసనలను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన అనంతరం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఈ పిటిషన్‌ను జర్నలిస్టు షాహీన్ అబ్దుల్లా దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సియు సింగ్ వాదించారు. రాజధాని ఢిల్లీలోని 23 చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ ప్రకటించాయి. ఈ ప్రదర్శనలను నిలిపివేయాలని కోరారు. అయితే ఈ నిరసనలను ఆపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ప్రదర్శనల్లో విద్వేషపూరిత ప్రసంగాలు, హింసాత్మక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను ఈ నెల 4న చేపడతామని తెలిపింది.
జులై 31న హర్యానాలోని నుహ్ జిల్లాలో వీహెచ్ పీ తదితర సంస్థలు నిర్వహించిన జలాభిషేక యాత్రను అడ్డుకునేందుకు ఓ వర్గం ప్రయత్నించిన సంగతి తెలిసిందే. వందలాది మంది దుండగులు యాత్రపై దాడి చేశారు, రాళ్లు రువ్వారు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులు మరియు వాహనాలను తగులబెట్టారు. పోలీస్ స్టేషన్ గోడను ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 116 మంది గాయపడ్డారు. ఇదంతా కుట్ర అని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, హోంమంత్రి అనిల్ విజ్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి:
హర్యానా, ఢిల్లీ: హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీలో పెట్రోలింగ్..
వైసీపీ వర్సెస్ కాంగ్రెస్: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చిదంబరం మండిపడ్డారు
నవీకరించబడిన తేదీ – 2023-08-02T15:27:47+05:30 IST