IND vs WI: విలాసాలు వద్దు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

IND vs WI: విలాసాలు వద్దు.. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై హార్దిక్ పాండ్యా అసంతృప్తి

ట్రినిడాడ్: రెండు, మూడో వన్డేల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మూడో వన్డే మ్యాచ్ అనంతరం పోస్ట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో హార్దిక్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల కనీస అవసరాలు కూడా తీర్చడంలో వెస్టిండీస్ బోర్డు విఫలమైందని విమర్శించారు. తమకు విలాసాలు అక్కర్లేదని, కనీసం సౌకర్యాలైనా ఉండాలన్నారు. తమ జట్టు మళ్లీ వెస్టిండీస్‌లో పర్యటించినప్పుడు ఆ దేశ బోర్డు కనీస సౌకర్యాలు కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

“బ్రియన్ లారా స్టేడియం మేము ఆడిన అత్యుత్తమ మైదానాలలో ఒకటి. మేము మళ్లీ వెస్టిండీస్‌కు వచ్చినప్పుడు పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ప్రయాణం నుండి ప్రాథమిక సౌకర్యాల వరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. గతంలో మేం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండేవి.. మాకు విలాసాలు వద్దు.. కానీ మా కనీస అవసరాలు తీర్చమని అడుగుతున్నాం’’ అని పాండ్యా అన్నాడు. రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం వన్డే మ్యాచ్ వేదికైన ట్రినిడాడ్ చేరుకోవడానికి భారత జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. విమానం ఆలస్యం కావడంతో భారత ఆటగాళ్లు రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.

ఇక చివరిదైన మూడో వన్డేలో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన భారత కుర్రాళ్లు ఏకంగా 200 పరుగుల భారీ తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. పరుగుల పరంగా వెస్టిండీస్‌పై టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్ (85), ఇషాన్ కిషన్ (77), హార్దిక్ పాండ్యా (70), సంజూ శాంసన్ (51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత 35.3 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 151 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4, ముఖేష్ కుమార్ 3, కుల్దీప్ యాదవ్ 2, జయదేవ్ ఉనద్కత్ ఒక వికెట్ తీశారు. గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *