అమ్మ క్యాంటీన్లు: 14 అమ్మ క్యాంటీన్ల మూసివేత

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-08-03T07:56:39+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమ్మ క్యాంటీన్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి.

అమ్మ క్యాంటీన్లు: 14 అమ్మ క్యాంటీన్ల మూసివేత

– అదే రోడ్డులో టి.నగర్ క్యాంటీన్

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమ్మ క్యాంటీన్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఒక్క చెన్నైలోనే ఇప్పటి వరకు 14 క్యాంటీన్లు మూతపడ్డాయి. స్థానిక టి.నగర్‌లోని అమ్మ క్యాంటీన్‌ను కూడా మూసివేసే దిశగా చెన్నై కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. చౌక ధరకు ఎంతో మంది పేదల ఆకలి తీర్చేందుకు 2013లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలో ఈ క్యాంటీన్లను ప్రారంభించారు. మంచి స్పందన రావడంతో ఈ క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. పలు రాష్ట్రాల అధికారులు కూడా ఈ క్యాంటీన్లపై అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకున్నారు. అలాంటి అమ్మ క్యాంటీన్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జయ మరణానంతరం గత అన్నాడీఎంకే పాలకులు కూడా ఈ క్యాంటీన్ల నిర్వహణపై పెద్దగా ఆసక్తి చూపలేదు. నామమాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఒక్క చెన్నైలోనే వార్డుకు రెండు చొప్పున మొత్తం 407 క్యాంటీన్లు ఉన్నాయి. వీటికి నగరవాసుల నుంచి అనూహ్య స్పందన లభించింది. జయ బతికి ఉన్నంత కాలం లాభనష్టాల మధ్య పొంతన లేకుండా పేదల ఆకలి తీర్చారు.

కానీ, ఆమె మరణానంతరం ప్రభుత్వాలు లాభనష్టాల బేరీజు వేసుకోవడంతో ఈ క్యాంటీన్ల నాణ్యత తగ్గిపోయింది. ఆ తర్వాత రాష్ట్రంలో అధికార బదలాయింపు తర్వాత అన్న క్యాంటీన్లను నిలిపివేస్తారంటూ వార్తలు వచ్చినా ముఖ్యమంత్రి స్టాలిన్ (ముఖ్యమంత్రి స్టాలిన్) క్యాంటీన్ల నిర్వహణకే మొగ్గు చూపారు. దీనిపై తీవ్ర సంతోషం నెలకొంది. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో ఒక్కో క్యాంటీన్ మూతపడుతోంది. ఇప్పటి వరకు నష్టాలు ఎక్కువగా ఉన్న 14 క్యాంటీన్లను మూసివేశారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా 392 క్యాంటీన్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టి.నగర్‌లోని త్యాగరాయ రోడ్డులోని అమ్మ క్యాంటీన్ కూడా మూసివేత దిశగా సాగుతోంది. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నవీకరించబడిన తేదీ – 2023-08-03T07:56:39+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *