పాట్నా : ప్రముఖ హిందీ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ విమల్ కుమార్ శుక్రవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. అరారియా జిల్లాలో జరిగిన హత్యను జర్నలిస్టులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు లోపించాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరారియా జిల్లాలోని రాణిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్‌లో విమల్ కుమార్ (40) నివసిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. ఛాతీకి కుడివైపున బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దుండగులు తమ మోటార్ బైక్‌పై పారిపోయారు.
విమల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు అరారియా పోలీస్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. ఘటనాస్థలికి ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు, డిటెక్టివ్‌లను పంపినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
విమల్ సోదరుడు శశిభూషణ్ 2019లో హత్యకు గురయ్యాడు.ఈ కేసులో విమల్ ప్రధాన సాక్షి. ఈ కారణంగానే విమల్‌ను హత్య చేసి ఉండవచ్చనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
విమల్ హత్యతో బీహార్‌లోని జర్నలిస్టులు ఆందోళనకు గురయ్యారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురువారం న్యూఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఆయనతో మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత నెలరోజులుగా నేరాలు పెరిగిపోయాయన్న ఆరోపణలను ప్రస్తావించారు. నితీశ్ స్పందిస్తూ.. కొన్ని ఘటనలు మాత్రమే జరిగాయని, వీటి ఆధారంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని చెప్పలేమన్నారు.
ఇది కూడా చదవండి:
విమాన ప్రమాదం: మలేషియాలో విమాన ప్రమాదం.. 10 మంది మృతి..
భారతీయ ముస్లింలు: భారతీయ ముస్లింలపై గులాన్నబీ ఆజాద్ వ్యాఖ్యలు.. భజరంగ్ దళ్, వీహెచ్ పీ స్పందన..
నవీకరించబడిన తేదీ – 2023-08-18T13:22:49+05:30 IST