గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలో అల్లు అర్జున్ కటౌట్లు వెలుస్తున్నాయి. కంచర్ల కన్వెన్షన్ ప్లేస్‌ను ప్రారంభించేందుకు ఆయన వస్తున్నారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఆ కన్వెన్షన్ హాల్ కట్టిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్వయానా అల్లు అర్జున్ మామగారైన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (కే చంద్రశేఖర్ రెడ్డి). అయితే ఈసారి బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఆయన కూడా ఉన్నారని, అందుకే తన సత్తా చాటేందుకు ఈ కన్వెన్షన్ హాల్‌ను నిర్మించి తన అల్లుడు అల్లు అర్జున్‌ని ఆహ్వానించి తెరవాలని కోరినట్లు టాక్.
నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తనను ఎంచుకుంటే పోటీ చేసేందుకు సిద్ధమని చంద్రశేఖర్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు మరోసారి తన వెనుక అల్లుడు ఉన్నాడు, విపరీతమైన అభిమానులు ఉన్నారని, తనకు ఓటు వేస్తారని ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించి తెరవాలని అల్లు అర్జున్‌ని పిలిచినట్లు తెలుస్తోంది.
కానీ అల్లు అర్జున్ మాత్రం ఈ హాలును తెరిచారు కానీ రాజకీయంగా ఏమీ మాట్లాడలేదు. నల్గొండ జిల్లా ప్రజలకు మేలు చేయాలని తన మామ కె.చంద్రశేఖర్ రెడ్డి ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించారని, ఈ వూరికి ఉపయోగపడుతుందని, అందుకు మా మామగారిని అభినందిస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన చంద్రశేఖర్ రెడ్డి అభిమానులకు, ఆయన ఆర్మీకి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే అల్లు అర్జున్ తన మామ తరుపున ప్రచారం చేయవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఈ సభలో అల్లు అర్జున్ కటౌట్‌లతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ జెండాలు, కేటీఆర్ కటౌట్లు కూడా కనిపించాయి. అల్లు అర్జున్‌ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ #పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకుడు కాగా, రష్మిక మందన్న కథానాయిక.
నవీకరించబడిన తేదీ – 2023-08-19T13:32:03+05:30 IST