దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు 20 (ఆదివారం) నుంచి కిలో టమోటాను రూ.40 చొప్పున విక్రయించాలని జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: మునుపెన్నడూ లేని విధంగా కిలో రూ.200 పలుకుతున్న టమోటాలు మెల్లగా దిగివస్తూ వినియోగదారులకు ఊరటనిస్తున్నాయి. గత రెండు నెలలుగా టమాటను సామాన్యులు మరిచిపోయారు. అరకగా వాటిని రైతు బజారులో కిలో రూ.50కి విక్రయించినా సరిపోలేదు. ఇప్పుడు కొత్త పంటలు రావడంతో క్రమేణా ధరలు తగ్గుతూ కిలో రూ.50కి చేరాయి. రెండు, మూడు రోజుల్లో కిలో రూ.30కి చేరే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. త్వరలో సాధారణ స్థితికి వస్తుందని తెలుస్తోంది.
కాగా, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు 20 (ఆదివారం) నుంచి కిలో టమోటాను రూ.40 చొప్పున విక్రయించాలని జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్‌లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. . ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఆదివారం నుంచి టొమాటో కిలో రూ.40కే వినియోగదారులకు లభ్యం కానుంది.
ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా టమాటా 50 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధరకే లభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇవ్వకముందే టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏపీలోని మదనపల్లి, అనంతపురంతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పండే టమాటా అందుబాటులోకి రావడంతో ఒక్కసారిగా టమాటా ధర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. సుమారు రెండు నెలలుగా ఊహించని విధంగా పెరిగిన టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-19T17:43:38+05:30 IST