భవిష్యత్తులో యావత్ ప్రపంచం వృద్ధికి భారత్ ఒక ఇంజన్ అవుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు.
త్వరలో మనం 5 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారతాం..
బ్రిక్స్ సదస్సులో మోదీ
జోహన్నెస్‌బర్గ్/వాషింగ్టన్, ఆగస్టు 22: భవిష్యత్తులో యావత్ ప్రపంచం వృద్ధికి భారత్ ఒక ఇంజన్ అవుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. “దేశంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంచాలనే ప్రత్యేక లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేసింది. భారత్ త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనది” అని మోదీ స్పష్టం చేశారు. మంగళవారం దక్షిణాఫ్రికాలో ప్రారంభమైన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల 15వ సమావేశం గురువారం వరకు జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు మోదీ మంగళవారం జోహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. మంగళవారం వాటర్‌క్లూఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో దిగిన భారత ప్రధానికి దక్షిణాఫ్రికా వైస్ ప్రెసిడెంట్ పాల్ మషతిలే స్వాగతం పలికారు. జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ సదస్సు జరగనున్న శాండ్‌టన్ సన్ హోటల్‌కు చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు సంగీత వాయిద్యాలు, భారత జెండాలతో స్వాగతం పలికారు. వీరిలో ఇద్దరు మహిళలు ఆయనకు రాఖీ కట్టడం విశేషం. అనంతరం నార్త్ రైడింగ్‌లో 14.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న స్వామినారాయణ ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. కాగా, ఈ సదస్సు ముగిసిన తర్వాత ప్రధాని ఒకరోజు పర్యటన నిమిత్తం గ్రీస్‌కు చేరుకుంటారు.
7వ తేదీన భారత్‌కు బైడెన్
వచ్చే నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు భారత్‌లో జరిగే జి-20 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత్‌కు వస్తారని వైట్‌హౌస్ కార్యాలయం మంగళవారం తెలిపింది. జి20 భాగస్వామ్య దేశాలు వివిధ ప్రపంచ సమస్యలపై చర్చిస్తాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరిన్ జీన్-పియర్ తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-23T02:36:23+05:30 IST