క్రీడా ప్రపంచంలో భారత్ మరింతగా ఎదగాలని, అందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.

104వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ క్రీడారంగంలో భారతదేశం మరింత ముందుండాలని, అందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం 104వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల చైనాలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో మన క్రీడాకారులు సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఆ క్రీడల్లో ఈసారి మన పిల్లలు 26 పతకాలు సాధించారని, అందులో 11 బంగారు పతకాలు సాధించారని కొనియాడారు. 1959 నుంచి జరుగుతున్న ఈ క్రీడల్లో మన క్రీడాకారులు 18 పతకాలు మాత్రమే సాధించారని.. ఆయా క్రీడల్లో పతకాలు సాధించిన నలుగురు యువ క్రీడాకారులతో ప్రధాని మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రయాన్-3 విజయాన్ని, అందులో మహిళా శాస్త్రవేత్తల పాత్రను కూడా మోదీ గుర్తు చేశారు. చంద్రుడిపై కూడా సూర్యుడు ఉదయిస్తాడని భారత్ ఆగస్టు 23న చంద్రయాన్ ప్రయోగం రుజువు చేసిందని వ్యాఖ్యానించారు. చంద్రయాన్-3 మిషన్‌లో పలువురు మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాల్గొన్నారని తెలిపారు. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌కు భారత్ నాయకత్వం వహించబోతోందని, ఆ సదస్సు మన దేశ సామర్థ్యానికి, శక్తికి నిదర్శనంగా నిలవబోతోందని పేర్కొన్నారు. జి20 సదస్సును విజయవంతం చేసి దేశ ప్రతిష్ఠను పెంచాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
“అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు” ..అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రధాని మోడీ తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా తొలుత ఆగస్టు 31న జరగనున్న ప్రపంచ సంస్కృత దినోత్సవాన్ని ప్రస్తావించిన మోదీ.. ఆగస్టు 29న నిర్వహించనున్న తెలుగు భాషా దినోత్సవం గురించి మాట్లాడుతూ.. సంస్కృతంలాగే.. తెలుగు భాష కూడా ఒకటని కొనియాడారు. మన ప్రాచీన వారసత్వ సంపద. భారతీయ సంస్కృతికి సంబంధించిన వెలకట్టలేని రత్నాలు తెలుగు సాహిత్యంలో దాగి ఉన్నాయన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-08-28T02:00:58+05:30 IST