ఏపీ రాజకీయాలు: విద్యార్థులకు టీచర్లు అవసరం లేదా? అందుకే టీచర్ల జీతాలు ఆగిపోయాయా..?

గురు పూజోత్సవం రోజున ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఉపాధ్యాయుల స్థానంలో గూగుల్ వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల కంటే గూగుల్ లో ఎక్కువ మెటీరియల్ అందుబాటులో ఉందన్నారు. ఉపాధ్యాయులకు తెలియని ఎన్నో విషయాలు గూగుల్ చేస్తే తెలుస్తాయని మంత్రి తెలిపారు. దీంతో మంత్రి ఆదిమూలపు సురేష్ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయులను అవమానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజమే.. ప్రపంచ వ్యాప్తంగా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. కానీ సాంకేతికత గురించి మాట్లాడటానికి గురువు అవసరం లేదని చెప్పడం అవివేకం. సాంకేతికతను సక్రమంగా వినియోగించుకుంటేనే ఉపయోగపడుతుంది. మరి అలాంటి టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో చెప్పడానికి టీచర్ కావాలి. పుస్తకాలను చూసి పాఠాలు చెప్పడమే కాకుండా జీవితాన్ని పాఠాలుగా బోధించే వారు చాలా మంది ఉన్నారు. నేటి సమాజంలో సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా గూగుల్ టీచర్ స్థానాన్ని భర్తీ చేయలేదు. ఇదే విషయాన్ని గతంలోనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రపంచం శరవేగంగా దూసుకుపోతున్నా.. గూగుల్ అందుబాటులోకి వచ్చినా.. విద్యార్థులకు టీచర్ అవసరమే.. ఆ స్థానాన్ని గూగుల్ ఎప్పుడూ భర్తీ చేయలేదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అయితే ఆయన వ్యాఖ్యలకు విరుద్ధంగా మంత్రి ఆదిమూలపు సురేష్ బడాయ్ మాటలు మాట్లాడి ఉపాధ్యాయుల పరువు తీశారు. ఆయన కూడా ఉపాధ్యాయుడనే విషయం మరిచిపోయారు. బైజస్ ల్యాప్ టాప్ లు ఇచ్చి గూగుల్ లో పాఠాలు చదివితే మార్కులు వస్తాయని మంత్రి హామీ ఇవ్వగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఏపీలో టీచర్లకు జీతాలు ఇవ్వడం మానేశారని వాపోతున్నారు.

ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రమశిక్షణ అవసరం. గురువు ఉంటేనే విద్యార్థి సన్మార్గంలో నడవగలడు. గూగుల్ తో చదువుకుంటే కాలేజీలు, స్కూళ్లు ఎందుకు అంటూ వైసిపి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. భవిష్యత్తులో స్కూళ్లు, కాలేజీలు మూసేస్తారో లేదోనని నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీచర్లను అగౌరవపరిచిన వ్యక్తి బాగుపడిన చరిత్ర లేదని నెటిజన్లు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మంత్రి సురేష్ వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉపాధ్యాయులను సన్మానించారా లేక అవమానించారా అనేది మంత్రి చెప్పాలన్నారు. గురుపూజోత్సవం రోజున ఉపాధ్యాయుల సన్మాన సభలో ఉపాధ్యాయులను దూషించడం తగదన్నారు. సాంకేతికత ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాదు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా గూగుల్ చదువులు లేవని.. ఉపాధ్యాయులే చదువులు నేర్పుతున్నారని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కరెంటు కోతలు: జగన్ పాలనలో వర్షాకాలంలో ఎక్కడ చూసినా కరెంట్ కోతలు

అయితే ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి సురేష్ ప్లేటు ఫిరాయించారు. ఉపాధ్యాయులను తాను అవమానించలేదని స్పష్టం చేశారు. మారుతున్న టెక్నాలజీ వల్ల కొంత మంది గూగుల్ పై ఆధారపడుతున్నారని, గురువులను మరిచిపోతున్నారనే ఉద్దేశంతోనే తాను మాట్లాడానన్నారు. తన తల్లిదండ్రులు టీచర్లని.. టీచర్లను గౌరవిస్తానని కవర్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *