కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. 7 గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా

ABN
మొదటి ప్రచురణ తేదీ – 2023-09-13T15:18:26+05:30 IST

కేరళలో గత 15 రోజుల్లో రెండు నిఫా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు వైరస్ వెలుగులోకి వచ్చిన కోజికోడ్ జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 7 గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. 7 గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా

కేరళలో గత 15 రోజుల్లో రెండు నిఫా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు వైరస్ వెలుగులోకి వచ్చిన కోజికోడ్ జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 7 గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు మూసివేశారు. వ్యాధిపై ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అన్నారు. ఈ వైరస్ గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు సోకుతుందని చెప్పారు. వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) బృందాలు కేరళకు చేరుకుని వైరస్‌పై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

7 గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించామని కోజికోడ్ జిల్లా కలెక్టర్ గీత తెలిపారు. తదుపరి నిర్ణయం వెలువడే వరకు 43వ వార్డులోని ప్రజలను బయటకు రానివ్వబోమని స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు, మందులు విక్రయించే దుకాణాలను మాత్రమే తెరవడానికి అనుమతిస్తామని వివరించారు. నిత్యావసర దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి. ప్రజలు మాస్క్‌లు ధరించాలని, కంటైన్‌మెంట్ ఏరియాల్లో శానిటైజర్లు వాడాలని గీత సూచించారు. ప్రభుత్వ సంస్థలు. విద్యాలయాలు, అంగన్‌వాడీలను మూసివేస్తామని తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఆరోగ్య నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

నవీకరించబడిన తేదీ – 2023-09-13T16:28:52+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *