ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు..

మూడో రోజు ఎన్‌కౌంటర్ కొనసాగింది

గాయాలతో సైనికుడి వీర మరణం

పిర్పంజల్‌లో ఉగ్రవాదులు హతమయ్యారు

శ్రీనగర్, సెప్టెంబర్ 15: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో సైన్యం చేపట్టిన ఆపరేషన్ ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. బుధవారం ప్రారంభమైన ప్రక్రియ.. శుక్రవారం కూడా పూర్తి కాలేదు. ఆర్మీ కల్నల్, మేజర్, పోలీసు డిఎస్పీ ఇప్పటికే మరణించారు, కాల్పుల్లో గాయపడిన ఒక సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతడు ఎవరనే వివరాలు తెలియరాలేదు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఆర్మీ డ్రోన్లను ఉపయోగిస్తోంది. పిర్పంజల్ పర్వత శ్రేణిలోకి ప్రవేశించగానే మోర్టార్ షెల్స్‌తో కాల్పులు జరుపుతున్నారు. దట్టమైన కోకెర్‌నాగ్ అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇక్కడ పెద్దఎత్తున కాల్పులు, భారీ పేలుళ్లు జరిగాయి. పీర్ పంజాల్ ప్రాంతంలో లష్కరే తోయిబా అనుబంధ రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ భావిస్తోంది. వీరిలో స్థానిక లష్కరే కమాండర్ ఉజైర్ ఖాన్ కూడా ఉన్నారనే అనుమానంతో మంగళవారం రాష్ట్రీయ రైఫిల్స్, కశ్మీర్ పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే చీకటి కమ్ముకోవడంతో ఉగ్రవాదులు పీర్ పంజాల్ పర్వతం పైకి చేరుకుని తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు.

నాడు పాక్ మూకలు.. నేడు ఉగ్రవాదులు..

కోకెర్నాగ్ అటవీ ప్రాంతంలోని పీర్ పంజాల్ పర్వతాలు భూమి నుండి 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఆర్మీ కార్యకలాపాలు చాలా క్లిష్టమైనవి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు సమీపంలో ఉన్న ఈ పర్వతాలను ఆక్రమించేందుకు పాక్ సైన్యం ఒకప్పుడు తీవ్రంగా ప్రయత్నించింది. ఇప్పుడు అవి ఉగ్రవాదులకు అడ్డాగా మారాయి.

నాన్నా.. జైహింద్

బుధవారం వీరమరణం పొందిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్‌ల అంత్యక్రియలు శుక్రవారం హర్యానాలోని పానిపట్‌లో జరిగాయి. మన్‌ప్రీత్ అంతిమ యాత్రకు ముందు, అతని కుమారుడు (6) సైనిక దుస్తులు ధరించి, జైహింద్ అంటూ అతనికి సెల్యూట్ చేశాడు. పక్కనే ఉన్న చెల్లెలు కూడా ఇలాగే చేసి కన్నీరుమున్నీరైంది. మేజర్ ఆశిష్ వచ్చే నెల తన పుట్టినరోజున ఇంట్లోకి ప్రవేశించాలని ప్లాన్ చేశాడు. ఆశిష్ మృతదేహాన్ని ఆ ఇంటి ముందు ఉంచడం స్నేహితులు, బంధువులను కలచివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *