ముఖ్యమంత్రి: రాజకీయాలకు అతీతంగా ఒక్క గొంతు వినిపిస్తాం..

– కావేరి వివాదంపై ఎంపీలకు సీఎం విజ్ఞప్తి

– ప్రధాని జోక్యం చేసుకోవాలి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జలాలు, భాష, సంస్కృతి పరిరక్షణలో రాజకీయాలకు అతీతంగా ఒకే గొంతుకను వినిపించి ఐక్యతను చాటాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంపీలకు పిలుపునిచ్చారు. కావేరీ జలాల వివాదం తాజా స్థితిపై చర్చించేందుకు ఆయన బుధవారం ఢిల్లీలో రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కావేరీ నీటి యాజమాన్య సంస్థ ఆదేశాల నేపథ్యంలో సమస్య తీవ్రరూపం దాల్చిందని, సుప్రీంకోర్టులో పోరాడుతూనే రాజకీయ పరిష్కారం సాధించాలనే పట్టుదలతో తమ ప్రభుత్వం ఉందన్నారు. ఈ వివాదాన్ని రాజకీయం చేయవద్దని సీఎం పలుమార్లు సభలో సూచించగా… తమిళనాడుకు నీరు విడుదల చేసి ఇప్పుడు సమావేశాలు నిర్వహించడం ఏమిటని కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, శోభాకరంద్లాజే సూటిగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తమిళనాడుకు నీటి విడుదల ప్రశ్నార్థకమేనని సీఎం వివరించినట్లు తెలుస్తోంది. ఆగస్టు తర్వాత కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు క్రమంగా ఆగిపోతాయని, ఆగస్టు తర్వాత తమిళనాడులో వర్షాలు కురుస్తాయని సీఎం చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఉండాలనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీల సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. కావేరి విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని కేంద్రమంత్రులు, ఎంపీలు హామీ ఇచ్చారని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.

ప్రధాని జోక్యం చేసుకోవాలి

కావేరీ జలాల వివాదం తీవ్రరూపం దాల్చిందని, రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కావేరీ జలాల వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కావేరి విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, అదే సమయంలో చట్టాన్ని గౌరవించామని గుర్తు చేశారు. రాష్ట్రంలోని 195 తాలూకాల్లో కరువు ఛాయలు అలుముకాయన్నారు. కావేరి బేసిన్‌లోని రిజర్వాయర్లలో కూడా నీరు అడుగంటుతున్నదని తెలిపారు. సాగుకు మాత్రమే కాకుండా తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కూడా కావేరి జలాలపైనే ఆధారపడి ఉందన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆయా సందర్భాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, శోభాకరంద్లాజే, భగవంత్ ఖూబా, నారాయణస్వామి, రాజీవ్‌చంద్రశేఖర్, ఎంపీలందరూ పాల్గొన్నారు.

నవీకరించబడిన తేదీ – 2023-09-21T11:55:07+05:30 IST

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *