బళ్లారి, (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం రాయచూరు జిల్లా మాన్వి పట్టణంలో ప్రజాస్వామిక వాదులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, తెలుగు సంఘాలు, కమ్మ సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించి అనంతరం ర్యాలీ నిర్వహించారు. స్థానిక కాకతీయ పాఠశాల ఆవరణలో సభ నిర్వహించి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాసి ఫ్యాక్స్ ద్వారా పంపారు. దాదాపు మూడు గంటల పాటు ర్యాలీ కొనసాగింది. వేలాదిగా వివిధ సంఘాల నాయకులు, ప్రజలు, మహిళలు హాజరయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సైకో జగన్ వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని, అలాంటి నాయకుడికి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.
మాన్వి ఎమ్మెల్యే హంపయ్యనాయక్, మాజీ ఎమ్మెల్యే రాణా వెంకటప్పనాయక్, గంగాధరనాయక్, బసవన్నగౌడ్, కర్నూలు జిల్లా టీడీపీ నాయకురాలు కోట్ల సుజాతమ్మ, ప్రముఖులు వెంకటసుబ్బారావు చౌదరి, శ్రీనివాస్, సురేశ్ తదితరుల ఆధ్వర్యంలో దాదాపు 4వేల మందికిపైగా ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే హంపయ్యనాయక్ మాట్లాడుతూ.. చంద్రబాబు సమర్థుడైన నాయకుడని, అలాంటి నాయకుడిని జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును విడుదల చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా విజయనగరం (హోస్పేట)లో పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు జరిగాయి. తెలుగు ప్రజలు, ప్రజాసంఘాలు, కమ్మసంఘాలు, వివిధ శిబిరాలకు చెందిన స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.