– రాష్ట్రవ్యాప్తంగా నెలకు రెండుసార్లు జనతాదర్శనం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఇకపై ప్రజలు తమ సమస్యలపై చర్చించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రి నివాసం, సచివాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో జనతా దర్శన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వేల సంఖ్యలో అర్జీలు వచ్చాయి. జిల్లా, తాలూకా స్థాయిలో ప్రజల సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రతి 15 రోజులకోసారి జనతా దర్శన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. కాగా, సోమవారం ఉదయం నుంచి ఆయా జిల్లా కేంద్రాల్లో ఇన్ ఛార్జి మంత్రులు జనతా దర్శనాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీలను ఆహ్వానించారు. జిల్లా స్థాయిలో జరిగిన జనతా దర్శన్ కార్యక్రమాలకు ఆయా జిల్లాల డీసీలు, ఎస్పీలు, జిల్లా పంచాయతీ సీఈవోలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నెల 30న బెంగళూరులో రాష్ట్ర స్థాయిలో జనతా దర్శన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి జనతా దర్శన్‌లో తాలూకా మరియు జిల్లా స్థాయిలో పరిష్కారం కాని వివాదాలు మరియు ఇతర ప్రముఖ సమస్యలు మాత్రమే పరిశీలించబడతాయి. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రుల నేతృత్వంలో జనతా దర్శన్ కార్యక్రమాలు అర్థవంతంగా నిర్వహించామని, ప్రజల్లోకి పాలనను తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడిందన్నారు.
జనతాదర్శన్‌కు అనూహ్య స్పందన
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జనతా దర్శన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. జనతా దర్శన్‌కు అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులను ఆహ్వానించామని, అన్ని జిల్లాల్లో 6,684 అర్జీలు వచ్చాయని, వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించామని తెలిపారు. దేవాదాయ శాఖకు సంబంధించిన సమస్యలపై 2వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, హావేరి జిల్లా నుంచి 774, హాసన్ జిల్లా నుంచి 432, కోలారు జిల్లా నుంచి 423 అర్జీలు వచ్చాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. మొత్తం 31 రెవెన్యూ జిల్లాల్లో వచ్చిన అర్జీల గణాంకాల వివరాలను సోమవారం మీడియాకు విడుదల చేశారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-26T07:54:25+05:30 IST