తెలుగు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుంచి కడిగిన ముత్యంలా నిర్దోషిగా బయటపడతారని కర్ణాటక పేర్కొంది

– టీడీపీ సమన్వయకర్త రవిమోహన్ చౌదరి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అక్రమ కేసుల నుంచి కడిగిన ముత్యంలా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటపడతారని కర్ణాటక టీడీపీ సమన్వయకర్త రవిమోహన్ చౌదరి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన నగరంలో ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను అక్టోబరు 3కి సుప్రీంకోర్టు వాయిదా వేయడంతో ఆయన ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసులు పెట్టి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదన్న వాస్తవాన్ని ఆంధ్రా పాలకులు తెలుసుకుంటే మంచిది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపేలా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే అనేక అవినీతి కేసుల్లో బెయిల్‌పై ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు సరికాదని, ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చంద్రబాబు రాజకీయ కుట్రతో అక్రమంగా అరెస్ట్ అయ్యి 20 రోజులుగా జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ప్రతిరోజూ భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నామన్నారు. బెంగళూరులోని ఐటీ, బీటీ ఉద్యోగులు బాబు వెంటే ఉన్నామని ప్రకటించి సంఘీభావం తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-28T12:08:55+05:30 IST