– రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
– టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి
అడయార్ (చెన్నై): దసరా పండుగను పురస్కరించుకుని చెన్నైలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న రాష్ట్ర ప్రజలు స్వగ్రామాలకు బయలుదేరారు. వారాంతపు సెలవులతో పాటు దసరా పండుగ సెలవులు కూడా కలిసి రావడంతో స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు 5 లక్షల మంది నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్లారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతోపాటు బస్సులు, ప్రైవేట్ బస్సులు, రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఉదయం నుంచి…: దసరా సెలవులను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో కోయంబేడు, పూందమల్లి, తాంబరం మెప్స్, మాధవరం బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. ఈ రద్దీని నివారించేందుకు 20 నుంచి 22వ తేదీ వరకు చెన్నై నుంచి వివిధ సుదూర ప్రాంతాలకు 2,765 ప్రత్యేక బస్సులను నడిపేందుకు రాష్ట్ర రవాణా శాఖ చర్యలు చేపట్టింది. అంటే సాధారణంగా నడుపుతున్న 2,100 బస్సులకు అదనంగా 651 సర్వీసులను నడిపింది. అదేవిధంగా కోయంబత్తూరు, మధురై, తిరుప్పూర్, బెంగళూరు, తిరునెల్వేలి, తిరుచ్చి, సేలం, కన్నియాకుమారి తదితర ప్రాంతాల నుంచి ఇతర పట్టణాలకు ఈ ప్రత్యేక బస్సులను నడిపారు. అయితే ఒక్క చెన్నై నగరం నుంచే 1,51,305 మంది ప్రయాణించినట్లు రవాణా శాఖ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా శనివారం కూడా సాధారణ సర్వీసులకు అదనంగా 950 బస్సులను నడిపారు. శనివారం మధ్యాహ్నం వరకు ఈ బస్సుల్లో 40 వేల మంది ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్నారు. అలాగే ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన బస్సులే కాకుండా ప్రయివేటు బస్సులు, రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి. సుదూర రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ రెండు మూడు నెలల ముందుగానే పూర్తి అవుతుంది. దీంతో జనరల్ బోగీలు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఈ జనరల్ బోగీల్లో కాలు కూడా పెట్టలేని ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు చెల్లించి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. చెన్నై నగరం నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 1200 నుండి 1500 ప్రైవేట్ బస్సులు తిరుగుతాయి. ఈ బస్సుల్లో యథావిధిగా వారాంతాల్లోనూ, వరుస సెలవు దినాల్లోనూ అధిక ఛార్జీలు వసూలు చేశారు.
నవీకరించబడిన తేదీ – 2023-10-22T11:17:38+05:30 IST