– అత్యవసర సేవల కోసం టెలిఫోన్ డైరెక్టరీ
– మంత్రి రామచంద్రం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ఈశాన్య రుతుపవనాలు ఉధృతమవుతాయని, దీని ప్రభావంతో నగరం, శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రామచంద్రన్ తెలిపారు. గురువారం ఉదయం మెరీనా బీచ్ ఎలిలగాం భవన సముదాయంలోని జాతీయ విపత్తు నిర్వహణ శాఖ కంట్రోల్ రూంలో చేపడుతున్న వరద నివారణ పనులను పరిశీలించి కంట్రోల్ రూం అధికారులతో చర్చించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి ఆరు రోజుల పాటు నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు హెచ్చరించారు. వర్షం బాధితులు అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం నంబర్ 1070కు ఫోన్ చేసి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 1077కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అదేవిధంగా బాధితులు 9445869849 వాట్సాప్ నంబర్‌కు ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తే స్థానిక సంస్థల అధికారులు లేదా జిల్లా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారు. . వర్ష బాధితులు, వరద బాధితుల సహాయార్థం ఇప్పటికే 4967 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 424 తీర ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు ఇచ్చేందుకు స్పీకర్లను కూడా సిద్ధం చేశారు. కోస్తా జిల్లాల్లో 1.13 లక్షల మంది బాధితులకు వసతి కల్పించేందుకు 121 శిబిరాలను సిద్ధం చేశామని, పాఠశాలలు, కళాశాలలు, సామాజిక కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంక్షేమ కేంద్రాల ద్వారా మొత్తం 4967 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 169 సహాయ కేంద్రాలను సిద్ధం చేశామని, వర్షపు నీటిని తొలగించేందుకు 260 మోటార్లను కూడా సిద్ధం చేశామని మంత్రి రామచంద్రన్ తెలిపారు. వర్ష బాధితులను, వరద బాధితులను ఎలా ఆదుకోవాలో జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను కూడా ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యవసర సేవల కోసం రూపొందించిన ఫోన్ డైరెక్టరీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి ఎస్‌కే ప్రభాకర్, రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వి.రాజారామన్, విపత్తు నివారణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీఏ రామన్ పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-11-03T10:41:11+05:30 IST