తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జనసేనకు సీట్ల కేటాయింపుపై పునరాలోచనలో పడింది. తెలంగాణలో జనసేనతో పొత్తు ఎవరికి లాభం అని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ పోల్ పెట్టారు. దాదాపు పది వేల మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల బీఆర్ఎస్, కేసీఆర్ లబ్ది చేకూరుతుందని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 31 శాతం మంది మాత్రమే బీజేపీ లాభపడుతుందని చెప్పారు. ఆయన పొత్తుకు వ్యతిరేకం. ఆయనే కాదు.. మెజారిటీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఒక్క ఎంపీ లక్ష్మణ్ మాత్రమే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని.. సీట్లు ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు.
జనసేన పార్టీ 32 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించింది. ఆ తర్వాత బీజేపీ పొత్తుల జోలికి వెళ్లింది. జనసేన పార్టీ ఎన్డీయేలో ఉన్నప్పటికీ తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే హఠాత్తుగా ఇప్పుడు పవన్ తో పొత్తు కోసం.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ ఇంటికి వెళ్లి చర్చించుకున్నారు. అనంతరం పవన్ ను తీసుకుని అమిత్ షా వద్దకు వెళ్లారు. చర్చలు జరిగాయి. జనసేన కోరినట్లు 32 సీట్లు కాకపోతే పది నుంచి పన్నెండు సీట్లు ఇస్తామని నమ్మబలికారు.
ఇప్పుడు ఆ సీట్లను ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు, ప్రచారంలో ఉన్న సీట్లు జనసేనకు ఇస్తే ఏమవుతుంది? కొంత మంది సీనియర్లు పార్టీకి డెడ్ లైన్ కూడా ఇచ్చారు. జనసేన పార్టీకి అసలు బలం లేదని చాలా మంది బీజేపీ నేతలు అంటున్నారు. పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. బీజేపీలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నేతల ఒత్తిడికి తలొగ్గి చివరి క్షణంలో జనసేనతో సీట్ల సర్దుబాటుకు నిరాకరించే అవకాశం కనిపిస్తోంది.
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, తాండూరులోనే కాకుండా ఇతర స్థానాల్లో కూడా బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని చెబుతున్నారు. జనసేన తరుపున ఒక్క బలమైన అభ్యర్థిని మాత్రమే చూపించాలని చెబుతున్నా ఇప్పుడు జనసేన టిక్కెట్ కోసం ఆ పార్టీలోకి వచ్చే వారు లేరని అంటున్నారు. చివరకు బీజేపీకే మద్దతు ప్రకటించి సొంత పార్టీ అభ్యర్థులను నిలబెడతారనే చర్చ సాగుతోంది.