సంగారెడ్డి నామినేషన్ కేంద్రం నుంచి దేశ్ పాండే అనే నాయకుడు నేరుగా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి లిస్టులో పేరు పెట్టి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు వేమువలవాడలో మహిళా నేత తుల ఉమదీ అదే పరిస్థితి. ఆమెకు టికెట్ ప్రకటించడంతో విద్యాసాగర్‌రావు తనయుడు వికాస్‌రావుకు టికెట్ ఇచ్చారు. ఇవే కాదు.. లెక్కలేనన్ని సినిమాలు… బీజేపీలో తయారయ్యాయి.
కంటోన్మెంట్‌లో చివరి క్షణంలో అసంతృప్త నేత గణేష్‌కి కాంగ్రెస్ టికెట్ కట్టబెట్టింది. వనపర్తిలోనూ అభ్యర్థి మారారు. సంగారెడ్డిలో పోటీ చేయాలని బీజేపీ ఆఫర్ చేసినా నీలం మధు ఆసక్తి చూపలేదు. ఆయన బీఎస్పీ వైపే మొగ్గు చూపారు. తెలంగాణలో పార్టీ అభ్యర్థుల ప్రకటన విషయంలో బీజేపీ మొదటి నుంచి అయోమయంలో ఉంది. వేములవాడ సీటు విషయంలో తీవ్ర గందరగోళం నెలకొని ఉన్న బీజేపీ మూడో జాబితాలో తుల ఉమకు కేటాయించింది. ఒకానొక దశలో ఈటల రాజేందర్ తనకు టికెట్ ఇవ్వకుంటే పార్టీని వీడిపోతానని నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వేల మందితో నామినేషన్ కూడా వేసింది. అయితే తుది జాబితాలో వికాస్‌రావు పేరును ప్రకటించారు. చివరి క్షణంలో అతనికి బి-ఫారం ఇచ్చారు.
వనపర్తి సీటును ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డికి బీజేపీ అధిష్టానం కేటాయించింది. ఆయన నామినేషన్ కూడా వేశారు. చివరి నిమిషంలో బీ-ఫారం మరొకరికి కేటాయించింది. బెల్లంపల్లి సీటు మొదట శ్రీదేవికి ఇచ్చారు. తీరా నాలుగో జాబితాలో అమాజీ పేరు ప్రకటించి అందరినీ అయోమయంలో పడేసారు. మళ్లీ తమ అభ్యర్థి శ్రీదేవి అని చెప్పి బీ-ఫారం అందజేశారు. అలంపూర్ స్థానంలో మరియమ్మకు సీటు కేటాయించారు. చివరకు ఆమె స్థానంలో రాజగోపాల్‌ను ఖరారు చేశారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థి తాను పోటీ చేయనని ప్రకటించడంతో తాజాగా కె.మహేందర్‌ను ప్రకటించారు.
బలమైన అభ్యర్థులు లేకుంటే… ఉన్నవారితో సర్కస్ ఆడుతూ బీజేపీ ఎందుకు ఇంత దారుణంగా తయారైందని క్యాడర్ ఆరా తీస్తోంది.