– రైల్వే స్టేషన్లలో ఇదే తంతు
అడయార్ (చెన్నై): దీపావళి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన నగరవాసులు సోమవారం రాత్రి నుంచి చెన్నైకి ప్రయాణం ప్రారంభించారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయి రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద రెండు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకున్న ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. దీపావళి పండుగకు నగరవాసులు ఈ నెల 9వ తేదీ నుంచి స్వగ్రామాలకు బయలుదేరారు. వీరి కోసం రాష్ట్ర రవాణా శాఖ కోయంబేడుతో పాటు మాధవరం, తాంబరం, కేకేనగర్, పూందమల్లి బైపాస్, తాంబరం మెప్స్ తదితర బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ బస్సుల ద్వారా నగరంలోని దాదాపు 10 లక్షల మంది తమ స్వగ్రామాలకు వెళ్లినట్లు అంచనా. దీపావళి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. దీంతో స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి నగరానికి వస్తున్నారు. వీరి కోసం రాష్ట్ర రవాణా శాఖ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోజువారీ బస్సు సర్వీసులతో పాటు వేలాది బస్సులను నడిపింది. అలాగే చెన్నైకి వచ్చిన రైళ్లన్నీ రద్దీగా ఉండడంతో ప్రయాణికులతో కిటకిటలాడాయి. మంగళవారం వేకువజాము నుంచి మరైమలర్ నగర్, సింగపెరుమాళ్ కోయిల్, గుడువాంజేరి, వండలూరు, పెరంగలత్తూరు, తాంబరం, క్రోంపేట, పల్లావరం, గిండితో పాటు పూందమల్లి, మధురవాయల్, నజరాత్‌పేట తదితర ప్రాంతాలకు ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది.
నేడు ప్రత్యేక బస్సులు
దీపావళి పండుగకు ఇళ్లకు వెళ్లిన వారిని తిరిగి నగరానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర రవాణాశాఖ బుధవారం కూడా ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రతిరోజు నడిచే 2100 బస్సులకు తోడు మొత్తం 3167 బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టారు. సోమవారం 1275 ప్రత్యేక బస్సులు నడపగా, మంగళవారం 975 బస్సులు నడిపారు. అలాగే బుధవారం 917 బస్సులు నడపనున్నారు.