పాలి: కాంగ్రెస్ పార్టీ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శించారు. ఆ పార్టీకి కుటుంబ పాలన ముఖ్యమన్నారు. ఈ నెల 25న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. రాజస్థాన్‌లోని పాలిలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగిస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం అవసరమని అన్నారు. 21వ శతాబ్దంలో దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో రాజస్థాన్ పాత్ర కీలకమని అన్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది. బుజ్జగింపు రాజకీయాల వల్ల గత ఐదేళ్లలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని ప్రజలు గమనించారన్నారు.
మహిళలపై నేరాల విషయంలో రాజస్థాన్‌ను కాంగ్రెస్ పార్టీ నంబర్ వన్‌గా నిలిపిందని మోదీ ఆరోపించారు. మహిళలు చేసే ఫిర్యాదులన్నీ అబద్ధమని సీఎం అంటున్నారని, మన దేశంలో ఎప్పుడైనా మహిళలు ఫేక్ కేసులు నమోదు చేశారా? అని ప్రధాని ప్రశ్నించారు. మహిళలను అవమానించడమేనా?
ఈరోజు మనం దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.. ఇందుకు రాజస్థాన్‌లో అభివృద్ధి ఆధారిత ప్రభుత్వం కావాలి. కాంగ్రెస్ పార్టీకి అవినీతి, కుటుంబ రాజకీయాలు ముఖ్యం. ఆ పార్టీ కేవలం బుజ్జగింపు రాజకీయాలకే పరిమితం అవుతుందని మోదీ విమర్శించారు. పొరుగు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.97 ఉందని, రాజస్థాన్‌లో మాత్రం పెట్రోలు ఎక్కువ ధరకు అమ్ముతున్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలను సమీక్షిస్తామని, భాజపా అధికారంలోకి వస్తే పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 25న జరగనుంది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 స్థానాల్లో కాంగ్రెస్ 99 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 73 స్థానాలకే పరిమితమైంది. బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఏర్పాటైంది.
నవీకరించబడిన తేదీ – 2023-11-20T14:23:43+05:30 IST