– సుప్రీంకోర్టులో పిటిషన్
పెరంబూర్ (చెన్నై): రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీకి మెరుగైన వైద్యం అందేలా బెయిల్ మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. చట్టవ్యతిరేక నగదు బదిలీ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసి జైలుకెళ్లిన రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ కోరుతూ చేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న సెంథిల్ బాలాజీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోవడంతో గత వారం ఓమండూరు ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రాగా.. ఆరోగ్య కారణాల రీత్యా సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. అలాగే అతడికి తీసిన ఎంఆర్‌ఐ స్కాన్‌లో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని తేలిందని వివరించారు. ఇంతలో జోక్యం చేసుకున్న జస్టిస్ త్రివేది.. మంత్రి సెంథిల్ బాలాజీ ఎంఆర్‌ఐ నివేదికను ప్రశ్నించారు. సెంథిల్ బాలాజీ చికిత్సకు సంబంధించిన వివరాలు సమర్పించామని, అతడిని పర్యవేక్షించి అవసరమైన వైద్యం అందించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని సెంథిల్ బాలాజీ తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో సెంథిల్ బాలాజీకి అందించిన వైద్య చికిత్స వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.
మంత్రికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు
స్థానిక ఓమండూరు ప్ర భుత్వాసుపత్రిలో సోమవారం మంత్రి సెంథిల్ బాలాజీ వైద్య పరీక్షలు కొనసాగాయి. పుళల్ జైల్లో ఉన్న ఆయన రెండు రోజుల క్రితం అపస్మారక స్థితిలో పడిపోవడంతో పోలీసు కాపలాతో మా స్టాన్లీ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ ఎక్స్ రే, ఈసీజీ, రక్త పరీక్షలు నిర్వహించి గుండె సంబంధిత పరీక్షల నిమిత్తం ఓమండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెదడులోని చిన్న నాళంలో రక్తం గడ్డకట్టినట్లు తేలిందని, ఆ సమస్యకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆయనకు కాలేయం, పేగు, గుండె శస్త్రచికిత్స నిపుణులు పరీక్షలు నిర్వహించారు. అలాగే మెడ వెనుక భాగంలో తలెత్తిన సమస్యకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు