రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ మార్కును దాటేసిందనే ట్రెండ్స్ వెలువడుతుండగా, ముఖ్యమంత్రి ఎవరన్న ఆసక్తికర ప్రశ్న తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్లు ఇప్పటికే వార్తల్లో ఉండగా, ఆధ్యాత్మిక నాయకుడు, అల్వార్ ఎంపీ మహంత్ బాల్కనాథ్ పేరు కూడా వినిపిస్తోంది.

జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజారిటీ మార్కును దాటేసిందనే ట్రెండ్స్ వెలువడడంతో ముఖ్యమంత్రి ఎవరన్న ఆసక్తికర ప్రశ్న తెరపైకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్లు ఇప్పటికే వార్తల్లో ఉండగా, ఆధ్యాత్మిక నాయకుడు, అల్వార్ ఎంపీ మహానత్ బాల్కనాథ్ పేరు కూడా వినిపిస్తోంది. బాల్కనాథ్ ఈ ఎన్నికల్లో తిజోరా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
అల్వార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్న బాలక్‌నాథ్ వయసు 40 ఏళ్లు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి, అఘాయిత్యాలు, మహిళలపై నేరాలు పెరిగిపోయాయని, ఈసారి ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో సమావేశమయ్యారు. అయితే మర్యాదపూర్వకంగానే కలిశానని బాల్కనాథ్ తెలిపారు.
సీఎం ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుంది: బాల్కనాథ్
సీఎం ఎవరన్న ప్రశ్నలకు బాల్కనాథ్ స్పందిస్తూ.. తాము ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తామని, సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎంపీగా ప్రజాసేవలో సంతోషంగా ఉన్నానన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాదిరిగానే బాలక్‌నాథ్ కూడా నాథ్ కమ్యూనిటీకి చెందినవారే. ఆరేళ్ల వయసులో సన్యాసం తీసుకున్నాడు. సన్యాసిగా మారాలనే నిర్ణయాన్ని కుటుంబ సభ్యులే తీసుకున్నారని, సమాజానికి సేవ చేయడమే తన ధ్యేయమన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-12-03T14:49:27+05:30 IST