చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన మైచౌంగ్ తుపాను తమిళనాడును వణికిస్తోంది. తుపాను ప్రభావంతో రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చెన్నైలో ఇప్పటివరకు కనీసం 8 మంది మరణించారు. మరోవైపు మైచౌంగ్ తుపాను మరికాసేపట్లో తీరం దాటనుంది. భారీ వర్షాల కారణంగా చెన్నై రోడ్లు నదుల్లా మారాయి. సోమవారం కురిసిన భారీ వర్షానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షాల కారణంగా పాఠశాలలు కూడా మూతపడ్డాయి. పరిస్థితులు చక్కబడే వరకు ఇంటి నుంచే పని చేయాలని ప్రైవేట్ కార్యాలయాలు తమ ఉద్యోగులను కోరాయి. భారీ వర్షం, ఈదురు గాలులకు చెట్లు, గోడలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు చేరింది. దీంతో ఆరోగ్య సంరక్షణ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
మైచౌంగ్ తుఫాన్ కారణంగా రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. చెన్నై విమానాశ్రయం రన్‌వేలో వరద నీరు చేరడంతో మంగళవారం ఉదయం 9 గంటల వరకు విమానాలు అందుబాటులో లేవు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు జిల్లాల్లో వర్షాల తీవ్రత స్వల్పంగా తగ్గినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం సోమ, మంగళవారాల్లో సెలవులు ప్రకటించింది. గత 24 గంటల్లో చెన్నైలోని పెరుంగుడిలో 29, తిరువళ్లూరు జిల్లా అవడిలో 28, చెంగల్‌పేటలోని మామల్లపురంలో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం, రాణిపేట, వెల్లూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, కన్యాకుమారి జిల్లాలకు రానున్న మూడు గంటలపాటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిచౌంగ్ తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం తెలిపారు. పోలీస్, ఫైర్ అండ్ రెస్క్యూ సహా వివిధ శాఖల సిబ్బందిని పెద్దఎత్తున మోహరిస్తున్నట్లు తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-12-05T10:33:32+05:30 IST