ధనాధన్ అదానీ!

ధనాధన్ అదానీ!

ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 15వ స్థానానికి చేరుకున్నాడు

ముంబై: అదానీ గ్రూప్ షేర్లలో వరుస ర్యాలీలతో దాని ఛైర్మన్ గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద కూడా విపరీతంగా పెరిగింది. బుధవారం నాటికి ఒక్కరోజులో 1,230 కోట్ల డాలర్ల (రూ. 1.02 లక్షల కోట్లు) వృద్ధితో 8,250 కోట్ల డాలర్లకు (రూ. 6.87 లక్షల కోట్లు) చేరింది. దాంతో బ్లూమ్‌బెర్గ్ రియల్ టైమ్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అదానీ 15వ స్థానానికి చేరుకున్నారు. భారత్‌తో పాటు ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ ర్యాంకింగ్‌కు చేరువయ్యారు. ప్రస్తుతం ముఖేష్ 9,140 కోట్ల డాలర్ల (రూ.7.61 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో 13వ స్థానంలో ఉన్నారు. గత వారంలో అదానీ ర్యాంకింగ్ 7 స్థానాలు మెరుగుపడింది. అదానీ షేర్లలో ఇదే జోరు కొనసాగితే.. రిచ్ లిస్ట్ లో మరింత ఎగబాకి, ఈ వారం చివరి నాటికి మళ్లీ అంబానీని వెనక్కి నెట్టే అవకాశాలున్నాయి.

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు వరుసగా నాలుగో రోజు ర్యాలీని కొనసాగించాయి. ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై 2030 నాటికి 7,500 కోట్ల డాలర్లు (రూ. 6.25 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు గౌతమ్ అదానీ ప్రకటించడం ఇందుకు దోహదపడింది. గ్రూప్‌లోని 8 కంపెనీలు సానుకూలంగా ముగిశాయి. బుధవారం అదానీ టోటల్ గ్యాస్ షేర్ 20 శాతం వృద్ధి చెందగా, అదానీ గ్రీన్ ఎనర్జీ 16.11 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 7.36 శాతం, ఎన్‌డిటివి 7.07 శాతం, సంఘీ ఇండస్ట్రీస్, అదానీ విల్మార్ 4 శాతం చొప్పున లాభపడ్డాయి. దాంతో గ్రూప్‌లోని 11 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మరో రూ.63,769 కోట్లు పెరిగి మొత్తం రూ.14.54 లక్షల కోట్లకు చేరుకుంది. హిండెన్ బర్గ్ ఆరోపణలతో భారీగా మార్కెట్ విలువ కోల్పోయిన అదానీ గ్రూప్ మళ్లీ రూ.14 లక్షల కోట్లు దాటడం ఇదే తొలిసారి.

9 నెలల్లో GQGకి 17,000 కోట్ల లాభం: హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా భారీగా క్షీణించిన అదానీ కంపెనీల్లో షేర్లను కొనుగోలు చేసిన GQG పార్టనర్స్ లాభాల పంట పండించింది. BQ ప్రైమ్ డేటా ప్రకారం, GQG అదానీ కంపెనీలలో రూ.20,360 కోట్ల వరకు పెట్టుబడి పెట్టగా, గత 9 నెలల్లో 84 శాతం (రూ. 17,000 కోట్లకు పైగా) పెరిగి బుధవారం నాటికి రూ.37,459 కోట్లకు చేరుకుంది. GQG పార్టనర్స్ అనేది భారతీయ అమెరికన్ పెట్టుబడిదారు రాజీవ్ జైన్ యాజమాన్యంలోని ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *