సీఎం రేవంత్‌కి ప్రధాని అభినందనలు
ప్రజాసేవలో విజయం సాధించాలి
వైఎస్ జగన్, చంద్రబాబులకు శుభాకాంక్షలు
సుఖేందర్ రెడ్డి, హరీష్, బండి సంజయ్,
జాజుల, లోకేష్ మరియు కంభంపాటి శుభాకాంక్షలు
న్యూఢిల్లీ/హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/అమరావతి/చెన్నై, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి, కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, పలువురు తెలంగాణ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని మోదీ గురువారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సౌభ్రాతృత్వం, సహకారం పెంపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు జగన్ ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ విజయం సాధించి ప్రజలకు సేవ చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అభినందించినట్లు ‘ఎక్స్’ వేదికపై స్టాలిన్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు మంత్రి వర్గానికి అభినందనలు తెలిపారు. వీరిలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్‌మోహన్‌రావు తదితరులున్నారు. హామీల అమలుకు ప్రభుత్వం కృషి చేయాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రగతి భవన్ పేరును సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే భవన్ గా మార్చడం హర్షణీయమన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం సచివాలయంలో రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
యూనియన్ల నుండి శుభాకాంక్షలు
నూతన సీఎం రేవంత్ రెడ్డికి కార్మిక సంఘాలు అభినందనలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు స్థితప్రజ్ఞ తదితరులు సచివాలయంలో రేవంత్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ఇతర నేతలు రేవంత్‌రెడ్డిని, ఆయన మంత్రులను అభినందించారు. రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌతు సీఎం రేవంత్‌ను అభినందించారు. తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.మోహననారాయణ, ఎస్ .నర్సరాజు మాట్లాడుతూ ఉద్యోగులు, పింఛనుదారులకు మూడు డీఏలు, ఈహెచ్‌ఎస్, ఐఆర్ పెంపు తదితర సమస్యలను కొత్త ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. తెలంగాణ పద్మశాలి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు సీఎం రేవంత్, మంత్రులను అభినందించారు.
నవీకరించబడిన తేదీ – 2023-12-08T03:25:32+05:30 IST