రాజస్థాన్ సీఎం ఎవరన్నదానిపై వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశం కానున్నారు.
జైపూర్: రాజస్థాన్ సీఎం ఎవరన్నదానిపై వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యేలు మంగళవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై స్పష్టత వస్తుంది. ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులుగా నియమితులైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, సరోజ్ పాండేలు కూడా పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు బీజేపీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశామని.. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొంటారని.. వారంతా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే భజనలాల్ శర్మ తెలిపారు.
కాగా, రాజస్థాన్ సీఎం రేసులో వసుంధర రాజే, అశ్విని వైష్ణవ్, కిరోరి లాల్ మీనా, రాజ్యవర్ధన్ రాథోడ్, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా, దియా కుమారి, అర్జున్‌రామ్ మేఘవాల్, సీపీ జోషి పేర్లు వినిపిస్తున్నాయి. మొదట బాబా బాల్కనాథ్ కూడా సీఎం రేసులో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే సీఎం రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవసాయిని బీజేపీ అధిష్టానం సీఎంగా నియమించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సీఎంను మార్చింది. ఇప్పటివరకు సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో మోహన్ యాదవ్ నియమితులయ్యారు. నవంబర్ 25న రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ప్రకటించిన ఫలితాల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.
నవీకరించబడిన తేదీ – 2023-12-12T08:37:05+05:30 IST