మధుయాష్కీ: బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం

– ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్‌

పారిస్ (చెన్నై): దేశంలో గత పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం పరిహాసంగా మారిందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ కార్యదర్శి, తెలంగాణ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ వ్యాఖ్యానించారు. రాయపేటలోని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఏఐసీసీ సమాచార విభాగం మేనేజర్ భవ్య నరసింహమూర్తితో కలిసి మధుయాష్కీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘దేశ సమైక్యత పాదయాత్ర’పై తమిళంలో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజలను నమ్మించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ పదేళ్లలో ప్రజల సంక్షేమాన్ని, దేశాభివృద్ధిని విస్మరించి అదానీ లాంటి ధనవంతుల అభివృద్ధికి పాటు పడ్డారని విమర్శించారు. నిత్యావసర వస్తువులు, ఇంధనం ధరలు విపరీతంగా పెంచారని, ఏడాది పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన దాఖలాలు లేవని అన్నారు. విద్యావంతుల కలలు నెరవేరలేదని, నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు చట్టబద్ధంగా కల్పించాల్సిన రిజర్వేషన్ల విషయంలో కూడా కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం ఆ వర్గాల ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్లోని సీబీఐ, ఐటీ, ఈడీ విభాగాలను కేంద్రం ప్రతిపక్షాలపై ప్రయోగించడం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అడ్డుకోవడం సర్వసాధారణమని అన్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై గళం విప్పే ప్రతిపక్ష ఎంపీలను బర్తరఫ్ చేసేలా చట్టాలు చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో టీఎన్‌సీసీ ఎస్సీ డివిజన్‌ ​​అధ్యక్షుడు నిరంజన్‌కుమార్‌, నాయకులు గోపన్న, ఎస్‌ఏ వాసు, నిలవన్‌, పొన్‌ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *