కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో ఘటన
వాష్‌బేసిన్ వద్ద బ్యాగులను వదిలేసిన ప్రజలు
బాధ్యులపై కఠిన చర్యలు: సిద్ధరామయ్య
బెంగళూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నగరంలోని కుండలహళ్లి సమీపంలోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం పది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ బిజీగా ఉన్న సమయంలో మధ్యాహ్నం 1:00 గంటలకు రెండు పేలుళ్లు సంభవించాయి. కస్టమర్లతో పాటు హోటల్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు. పేలుడు శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రెండు బ్యాగులతో కేఫ్‌కు వచ్చిన వారు వాష్ బేసిన్ వద్ద ఒక బ్యాగ్ పడి ఉండడాన్ని గుర్తించారు. అక్కడ పేలుడు సంభవించింది. ఘటన జరిగిన ప్రాంతంలో బ్యాటరీ, వైర్లు, మేకులు, ఐడీ కార్డుకు సంబంధించిన ట్యాగ్‌లు తదితర వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సమీపంలోనే మరో బ్యాగ్ కూడా కనిపించింది. ఎన్ఐఏ, సీసీబీ, ఇంటెలిజెన్స్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. కేఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేఫ్‌లో పేలుడు సంభవించిందని, మరిన్ని వివరాల కోసం అన్వేషిస్తున్నామని డీజీపీ అలోక్ మోహన్ తెలిపారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. కాగా, రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. అయితే దీన్ని ఉగ్రవాద చర్యగా ప్రకటించలేం. పథకం ప్రకారమే పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేఫ్‌లో బ్యాగ్‌ను వదిలి వెళ్లిన వ్యక్తిని గుర్తించామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు.
పది సెకన్ల పేలుళ్లు: కేఫ్ MD
పది సెకన్ల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని రామేశ్వరం కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ దివ్య తెలిపారు. బయట నుంచి వచ్చిన వ్యక్తి బ్యాగ్ తీసుకొచ్చి లోపల పెట్టాడు. 12.55 గంటల సమయంలో వినియోగదారులు వాష్ బేసిన్‌కు వెళుతుండగా పేలుడు సంభవించిందని, బ్యాగ్‌పై అనుమానం ఉందని వారు తెలిపారు. తమ కేఫ్‌లో గతంలో రెండుసార్లు అనుమానాస్పద బ్యాగులు వచ్చాయని, ఒక బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని దివ్య వివరించారు.