త్వరలో మరో 16,940 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎస్ సోమేశ్
గడువులోగా ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది
హైదరాబాద్ , నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో అనుమతి ఇవ్వనుంది. ఉద్యోగ నియామకాల అంశంపై బీఆర్‌కే భవన్‌లో ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడారు. అయితే ఈ పోస్టులు ఏ శాఖకు చెందినవో స్పష్టత లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 80,039 డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పోస్టుల్లో వివిధ శాఖల్లో వివిధ కేటగిరీలకు చెందిన 60,929 పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేసినట్లు సీఎస్ ఈ సందర్భంగా వివరించారు. మరో 16,940 పోస్టులకు అనుమతులు ఇచ్చేందుకు సర్వం సిద్ధం చేశామని, త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు.
ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే సంబంధిత బోర్డులు రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రారంభించి నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వివిధ పోస్టులకు సంబంధించి సర్వీస్ రూల్స్ లో మార్పులు చేసి పూర్తి సమాచారాన్ని టీఎస్ పీఎస్సీకి అందజేయాలని అన్ని శాఖలను ఆదేశించింది. అప్పుడే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌లు జారీ చేయగలదు. పోస్టుల భర్తీపై ప్రతిరోజు సమీక్షించాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఈ సమావేశంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి. జనార్దన్‌రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, సాధారణ పరిపాలన, ఎస్సీ అభివృద్ధి, ఆరోగ్య, వ్యవసాయ శాఖల కార్యదర్శులు వి.శేషాద్రి, రాహుల్ బోజా, ఎస్ ఎఎం రిజ్వీ, రఘునందన్ రావు, పిసిసిఎఫ్ ఆర్ ఎం డోబ్రియల్ పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2022-11-30T14:33:51+05:30 IST