ABN
, First Publish Date – 2023-07-26T02:31:57+05:30 IST
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకొంది. హద్దుమీరి ప్రవర్తించిన కౌర్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధంతోపాటు ఆమె ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లను చేర్చినట్టు ఐసీసీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆసియాడ్‌లో తొలి రెండు టీ20లకు దూరం
దుబాయ్: భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur)పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకొంది. హద్దుమీరి ప్రవర్తించిన కౌర్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధంతోపాటు ఆమె ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లను చేర్చినట్టు ఐసీసీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో సెప్టెంబరు-అక్టోబరులో జరిగే ఆసియా క్రీడల్లో తొలి రెండు టీ20 మ్యాచ్‌లకు హర్మన్‌ప్రీత్ దూరం కానుంది. బంగ్లాదేశ్(Bangladesh)తో జరిగిన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్ ప్రవర్తన విమర్శలకు దారితీసింది. ఈ మ్యాచ్‌లో నహీదా బౌలింగ్‌లో అంపైర్ తనను అవుట్‌గా ప్రకటించడంతో హర్మన్ ఆవేశానికి లోనైంది. కోపంగా వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లా ప్లేయర్లతో కలిసి ఫొటో సెషన్ సందర్భంగా.. మీతోపాటు అంపైర్లను కూడా తెచ్చుకోవాల్సిందంటూ మాట్లాడడం కూడా వివాదాస్పదమైంది. ఆ తర్వాత కూడా అంపైరింగ్‌ను బహిరంగంగానే తూర్పరబట్టింది. దీంతో ఆమె మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించారు. హర్మన్ శిక్షకు అంగీకరించినందున తదుపరి విచారణ అవసరం లేదని ఐసీసీ పేర్కొంది. కాగా హర్మన్ వైఖరిని భారత మాజీలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కెప్టెన్ హోదాలో ఉన్న హర్మన్ క్రమశిక్షణారాహిత్యం ఏమాత్రం సమర్ధనీయం కాదని భారత మాజీ సార థులు డయానా ఎడుల్జీ, శాంతా రంగస్వామి అన్నారు.
Updated Date – 2023-07-26T02:31:57+05:30 IST