Siraj : సిరాజ్‌ విజృంభణ

Siraj : సిరాజ్‌ విజృంభణ


ఐదు వికెట్లతో అదుర్స్‌

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 255

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 118/2

భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా (33 బంతుల్లో) 50 పరుగులు అందించిన జోడీగా రోహిత్‌-జైస్వాల్‌

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (5/60) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో చెలరేగాడు. దీంతో నిలకడగా ఆడుతున్న వెస్టిండీస్‌ నాలుగో రోజున 46 బంతులకే మిగిలిన ఐదు వికెట్లనూ కోల్పోయి.. 255 పరుగులు చేసింది. అథనజె (37) మాత్రమే రాణించాడు. ముకేశ్‌, జడేజాలకు రెండేసి వికెట్లు దక్కాయి. 183 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌కు.. ఓపెనర్లు రోహిత్‌ (44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), జైస్వాల్‌ (30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 38) టీ20 తరహా ఆటతో మెరుపు ఆరంభాన్ని అందించారు. అయితే ఈ దూకుడుకు వరుణుడు అడ్డుపడ్డాడు. రెండో సెషన్‌లో రెండోసారి మ్యాచ్‌ ఆగిపోవడంతో టీ విరామం ప్రకటించారు. ఆ సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 2 వికెట్లకు 118 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌ (10 బ్యాటింగ్‌), ఇషాన్‌ కిషన్‌ (8 బ్యాటింగ్‌) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 301 పరుగుల తిరుగులేని ఆధిక్యంతో కొనసాగుతోంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులు చేసింది.

సిరాజ్‌ ధాటికి 7.4 ఓవర్లలోనే..:

శనివారం మూడో రోజు వర్షం కారణంగా 67 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అటు ఫ్లాట్‌ పిచ్‌ అయినప్పటికీ విండీస్‌ మాత్రం డ్రా ఆలోచనతో డిఫెన్స్‌నే నమ్ముకుంది. ఆఖరి సెషన్‌లో బ్లాక్‌వుడ్‌ (20) క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న రహానె ఎడమవైపు డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో పట్టేయడం హైలైట్‌గా నిలిచింది. అటు సిరాజ్‌ అద్భుత బంతితో జోషువా (10)ను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన వెంటనే మరో గంటపాటు వర్షం ఆటంకపరిచింది. ఇక పది ఓవర్ల తర్వాత వెలుతురు మందగించడంతో ఆటకు ముగింపు పలికారు. ఇక నాలుగో రోజు ఆదివారం అర్ధగంట ముందుగానే ఆట ప్రారంభం కాగా.. విండీస్‌ దారుణంగా తడబడింది. కేవలం 7.4 ఓవర్లలోనే మిగిలిన ఐదు వికెట్లనూ కోల్పోయింది. చక్కగా కుదురుకున్న అథనజెను ఆరంభ ఓవర్‌లోనే పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ ఎల్బీతో పెవిలియన్‌కు చేర్చాడు. ఇక ఆ తర్వాత సిరాజ్‌ హవా ఆరంభమైంది. టెయిలెండర్లు హోల్డర్‌ (15), జోసెఫ్‌ (4), రోచ్‌ (4), గాబ్రియెల్‌ (0)ల వికెట్లను తను చకచకా తీయడంతో భారత్‌కు భారీ ఆధిక్యం దక్కింది.

టీ20 స్టయిల్లో…:

రెండో ఇన్నింగ్స్‌లో సాధ్యమైనంత వేగంగా ఆడాలనే వ్యూహంతో భారత్‌ బరిలోకి దిగగా.. తొలి ఓవర్‌లోనే జైస్వాల్‌ 6,4తో 12 పరుగులు అందించాడు. ఆ తర్వాత రోహిత్‌ వేగం పెంచి బౌండరీలతో దుమ్ము రేపాడు. ఈక్రమంలో అతడి రెండు క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేశారు. ఓపెనర్లు పోటాపోటీగా పరుగులు సాధించడంతో తొలి ఆరు ఓవర్లలోనే జట్టు 53 పరుగులు చేసింది. పదో ఓవర్‌లో రెండు ఫోర్లతో రోహిత్‌ 35 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఎట్టకేలకు 12వ ఓవర్‌లో రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను జోసెఫ్‌ పట్టేయడంతో తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వెంటనే వర్షం కురవడంతో 20 నిమిషాల ముందుగానే లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు. రెండో సెషన్‌ తొలి ఓవర్‌లోనే జైస్వాల్‌ అవుట్‌కాగా మరో రెండు ఓవర్ల తర్వాత వరుణుడి ధాటికి టీ బ్రేక్‌కు వెళ్లాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *