డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా రైతులకు సేవలందిస్తున్న ‘ద్వార ఈ-రిజిస్ట్రీ’ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPOs) రైతులకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తుంది…

ముంబై: డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా రైతులకు సేవలందిస్తున్న ‘ద్వార ఈ-రిజిస్ట్రీ’ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్పిఓ) ద్వారా రైతులకు అవసరమైన సమాచారం, రుణాలు అందజేస్తున్న ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం ద్వార ఈ-రిజిస్ట్రీ పోర్టల్లో 180 ఎఫ్పీఓలు నమోదయ్యాయని కంపెనీ సీఈవో తారకేశ్వర్ తెలిపారు. దాదాపు 50 వేల మంది రైతులు తమ కంపెనీ సేవలను పొందుతున్నారు. ప్రస్తుతం కంపెనీ మహారాష్ట్ర, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రైతులు 20కి పైగా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని పంటను విక్రయించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం సోయాబీన్, మొక్కజొన్న వంటి ఉత్పత్తులను కంపెనీలు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఈ-రిజిస్ట్రీ ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలో సేవలు అందిస్తున్నామని, మరోవైపు రైతులకు రుణాలు అందించేందుకు పలు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ సంస్థలు రైతులకు వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రుణాలు మంజూరు చేస్తాయి. కార్యాచరణ విస్తరణలో భాగంగానే తెలంగాణలో అడుగుపెట్టామన్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా హాలియా ప్రాంతంలోని పాడి రైతులకు తమ వేదిక ద్వారా సేవలందిస్తున్నట్లు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ఉన్న డేటాను వినియోగించుకుని మరింత మంది రైతులకు సేవలందించాలని చూస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నాబార్డ్తో జట్టుకట్టడం ద్వారా అక్కడి రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తారకేశ్వర్ తెలిపారు.
నవీకరించబడిన తేదీ – 2023-07-16T02:55:29+05:30 IST