– ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు
– రాయచూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ శివరాజ్ పాటిల్
– బాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా రాయచూరులో నిరసన వెల్లువెత్తింది
రాయచూర్ (బెంగళూరు): అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం దుర్మార్గమని బీజేపీ రాయచూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ శివరాజ్ పాటిల్ ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళవారం రాయచూరు స్టేడియంలోని ఎయిమ్స్ పోరాట వేదిక వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నగరంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించి జిల్లా అధికారి కార్యాలయం వద్ద వినతిపత్రం అందజేశారు. అంతకుముందు జరిగిన భారీ సభలో ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబును జగన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసిందన్నారు. అభివృద్ధికి మారుపేరుగా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా నిరంతరం పనిచేసిన చంద్రబాబు బాబును అరెస్ట్ చేయడం దారుణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన చంద్రబాబు, నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించిన దార్శనికుడని, ఆయన కృషిని ఎండగట్టిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
ప్రజాస్వామ్యవాదులందరూ ఆయన అరెస్టును ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. జేడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహంతేశ్ పాటిల్ అత్తనూర్ మాట్లాడుతూ అభివృద్ధి రాజకీయాల గురించి ఆలోచించకుండా దురుద్దేశంతో చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. తనను అరెస్టు చేసిన తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎ.పాపారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడంలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్ తానే తవ్వుకున్న గోతిలో పడతారన్నారు. ఈ సందర్భంగా మంత్రాలయ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి తిక్కారెడ్డి, సీనియర్ జర్నలిస్టు రాజేంద్ర, కమ్మవారి సంఘం అధ్యక్షుడు బి.ప్రసాద్, కన్వీనర్ సుంకర రత్నమాల, వెంకటేశ్వరరావు, కేశరావు, ఆనంద్, సూర్యదేవర ఉమారాణి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నవీకరించబడిన తేదీ – 2023-09-27T10:58:27+05:30 IST