IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌ల నుంచి కోహ్లీ ఔట్.. మరి రోహిత్ పరిస్థితి ఏంటి..?

IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌ల నుంచి కోహ్లీ ఔట్.. మరి రోహిత్ పరిస్థితి ఏంటి..?

దక్షిణాఫ్రికాలో త్వరలో ప్రారంభం కానున్న టీ20, వన్డే సిరీస్‌లకు టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. కోహ్లి ఇప్పటికే బీసీసీఐకి, సెలెక్టర్లకు తెలియజేసినట్లు పలు జాతీయ క్రీడా వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం హాలీడే ట్రిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. 2022 టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. భవిష్యత్తులోనూ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో కొనసాగుతాడా? లేదా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటనలో కోహ్లీ టీ20 సిరీస్‌కు దూరం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే వన్డే సిరీస్‌కు దూరం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ టెస్టు సిరీస్ అందుబాటులో ఉంటుందని కోహ్లీ తెలిపాడు. సఫారీ పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే, టీ20 సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం హాలిడే ట్రిప్‌లో భాగంగా లండన్‌లో ఉన్నాడు.

అలాగే హిట్‌మ్యాన్ కూడా 2022 T20 ప్రపంచకప్ తర్వాత మళ్లీ పొట్టి క్రికెట్ ఆడలేదు. అయితే సఫారీ పర్యటనలో ఈ హిట్ మ్యాన్ టీ20 సిరీస్ కు దూరంగా ఉంటాడని సమాచారం. తద్వారా వన్డే సిరీస్‌ నాటికి అతను జట్టులో చేరవచ్చు. లేదంటే వన్డే సిరీస్‌కు కూడా దూరమైనా ఆశ్చర్యపోనవసరం లేదు. 2024 టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా? లేదా? దక్షిణాఫ్రికా పర్యటనలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే వీరిద్దరూ వైట్ బాల్ క్రికెట్ కు దూరంగా ఉండడం గమనార్హం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడే భారత జట్టును ఎంపిక చేయనుంది. కాగా, ప్రపంచకప్ తర్వాత కొంతకాలంగా తీరిక లేకుండా క్రికెట్ ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కాగా.. 10 నుంచి 14 వరకు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, 17 నుంచి 21 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, 26 నుంచి జనవరి 7 వరకు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *